Site icon HashtagU Telugu

CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్

CM Chandrababu speech in TDP Malish meeting

CM Chandrababu speech in TDP Malish meeting

TDP MLS Meeting : ముఖ్య మంత్రి చంద్రబాబు ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడారు. లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారు. త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్‌ఆర్‌సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.

మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. 2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: PM Modi : మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ 

”దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ టీడీపీ. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎన్నికల సీట్ల కేటాయింపులో తెదేపాకు అండగా ఉన్నవర్గాలకు ప్రాధాన్యం కల్పించాం. ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కని వారికి అవకాశం కల్పించాం. ‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం. గెలిచాం మన పని అయిపోయిందని అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితుల వల్ల పార్టీని నమ్ముకున్న కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చాం. ప్రజలు మనల్ని విశ్వసించారు.. దాని ప్రకారం ముందుకెళ్లాలి. ఇప్పుడు అందరిపై బాధ్యత ఉంది.

కొత్త ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దాదాపు 80 మంది వరకు కొత్తవారే. కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఫ్యామిలీని ఐక్యంగా ఉంచేందుకు ఇంటిపెద్ద ఆలోచిస్తుంటారు. రాజకీయ పార్టీ కూడా అంతే. నాపై ఆ బాధ్యత ఉంది. అధికారంలోకి రాగానే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రాష్ట్రంలో ఏ అరాచకం చూసినా దాని వెనుక గంజాయి బ్యాచ్‌ ఉంటుంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వచ్చింది కనుక నిలదొక్కుకుంటున్నాం. 16,437 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నాయి. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు. ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం. వరదలు వస్తే ఎలా పనిచేశామో చూశాం. యుద్ధప్రాతిపదికన పనులు చేశాం.. అందరినీ ఆదుకున్నాం..అన్నారు.

చండీగఢ్‌లో హరియాణా సీఎం ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ 5 గంటల పాటు అక్కడ కూర్చున్నారు. మోడీ అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మోడీ నుంచి నేర్చుకోవాలి. ఆయన పట్టుదల, కృషి వల్లే మూడోసారి ప్రధాని అయ్యారు. ఆరుసార్లు గుజరాత్‌లో బీజేపీ గెలిచింది. మూడోసారి హరియాణాలో విజయం సాధించారు. సమష్టిగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఏం చేసినా ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేశారు. దేశంలో ఎవరికీ దక్కని విజయం మోడీకి దక్కిందంటే దాని వెనుక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి. ఎక్కడా తప్పు చేయకుండా పార్టీని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు”అని చంద్రబాబు కొనియాడారు. తనను జైల్లో పెడితే పవన్‌కల్యాణ్‌ వచ్చి పరామర్శించి.. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు.  వైఎస్‌ఆర్‌సీపీ చేయని తప్పులు లేవని.. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 93 శాతం స్ట్రయిక్‌రేట్‌ ఇచ్చారన్నారు.

Read Also: Maharashtra Assembly Election 2024: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల స‌మ‌రం.. నేడు బీజేపీ మొద‌టి జాబితా..?