రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ పటిష్టమైన పాలసీల ప్రభావంతో దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు ఆరు ఎస్‌ఐపీబీ ( State Investment Promotion Board) సమావేశాల్లో 76 ప్రాజెక్టులకు రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిని డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించాలనన్నారు.
CM అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆరో ఎస్‌ఐపీబీ సమావేశంలో 19 కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన రూ.33,000 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే వీటి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు.
ప్రతి ఒప్పంద సంస్థ ప్రాజెక్టును శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలనీ, ప్రతీ ప్రాజెక్ట్ పురోగతిపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలనీ సీఎం సూచించారు. పెట్టుబడుల స్థితిగతులపై సమాచారం అందేందుకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
టూరిజం రంగంలో హోటళ్లకు, గదులకు తీవ్ర కొరత ఉన్నదని సీఎం పేర్కొన్నారు. పెద్ద ఎత్తున హోటల్ గదులు అందుబాటులోకి వస్తే పర్యాటక రంగానికి బలమవుతుందని అన్నారు. లక్ష్యంగా 50 వేల హోటల్ రూమ్‌లు అందుబాటులోకి తేవాలని తెలిపారు. అందుబాటు ధరల్లో గదులు ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని వివరించారు.