Site icon HashtagU Telugu

CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (CM Chandrababu) శుక్ర‌వారం అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా ఇతర ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వరద పరిస్థితి వివరాలు

సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి ప్రస్తుత వరద వివరాలను నివేదించారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్‌మెంట్‌లో 33 టీఎంసీలు, తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో 11 టీఎంసీల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార నదికి 1.05 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం తగ్గుముఖం పట్టినా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.

Also Read: Chandra Babu : ఆటో, క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనున్నారు.!

నాలుగు కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం

భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నాలుగుచోట్ల నలుగురు మృతి చెందిన విషయాన్ని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రమాదాల్లో విశాఖపట్నం నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఇద్దరు వృద్ధులు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ మృతుల కుటుంబాల ప‌ట్ల‌ ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

విద్యుత్ సరఫరా, పునరుద్ధరణపై సమీక్ష

వరద కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కూలిన చెట్లలో 90 శాతం మేర తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈపీడీసీఎల్ (EPDCL) అధికారులు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈరోజు సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

Exit mobile version