Site icon HashtagU Telugu

Chandrababu : రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది – చంద్రబాబు

Cm Chandrababu Recalling Ar

Cm Chandrababu Recalling Ar

Chandrababu React on Illegal Arrest : ఏ ఆధారాలు లేకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆనాడు బస్సులో ఉంటే అరెస్టు చేశారు. ఈరోజూ బస్సులో ఉండి ప్రజల కోసం మంచి చేస్తున్నా అని గత ఏడాది తనను అక్రమంగా అరెస్ట్ చేసిన దానిపై రియాక్ట్ అయ్యారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబును CID గతేడాది ఇదేరోజున (సెప్టెంబర్ 09) అరెస్ట్ (Chandrababu Arrest) చేసింది. చంద్రబాబు ను అరెస్ట్ చేసి ఏదో పెద్ద విజయం , ఘనత సాధించామని వైసీపీ నేతలు భావించారు..కానీ చంద్రబాబు అరెస్ట్ తోనే వారి పతనం మొదలైందని ఆలస్యంగా తెలుసుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. చంద్రబాబు విడుదలయ్యే వరకు తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)తో రాష్ట్రమంతా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన్ను రోడ్డుమార్గంలో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో అడుగడుగునా టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. పెద్దఎత్తున పోలీసుల్ని మొహరించి వారిని లాఠీలతో చితకబాదుతూ ఈడ్చిపడేశారు. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో పవన్ (Pawan Kalyan) రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు.

చంద్రబాబు రెండుమూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే, 53 రోజుల వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. అధినేత జైలులో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చాటారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని నినదించారు. ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బాబు అరెస్ట్‌పై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి 53వ రోజున అంటే 31 అక్టోబర్ 2023న జైలు నుంచి విడుదలయ్యారు.

ఈరోజు రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించి చంద్రబాబు ను మరోసారి సీఎంని చేసి ఆనందంగా ఉన్నారు. తనను అరెస్ట్ చేసి సరిగ్గా ఈరోజుకు ఏడాది కావడం తో చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఏ ఆధారాలు లేకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లోనే కాదు 80 దేశాల్లో నా కోసం పోరాడారు. ఆనాడు బస్సులో ఉంటే అరెస్టు చేశారు. ఈరోజూ బస్సులో ఉండి ప్రజల కోసం మంచి చేస్తున్నా. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. శారీరకంగా, మానసికంగా బాధలు అనుభవించినా ప్రజల కోసమే పోరాడతా’ అని తెలిపారు .

Read Also : Pawan Kalyan – Gollaprolu : జ్వరంతో బాధపడుతూ కూడా పవన్ పర్యటన