Nitish Kumar Reddy: క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల చెక్ అందించిన సీఎం

ఈ సిరీస్‌లో వీరోచిత సెంచరీతో త‌న‌లో ఉన్న ప్రతిభను క్రికెట్ ప్ర‌పంచానికి చూపాడు. అతని సహకారాన్ని గుర్తిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy: బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో టీమిండియా త‌ర‌పున అద్భుతంగా రాణించాడు టీమిండియా క్రికెట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy). నితీశ్ ఆంధ్ర‌కు చెందిన ఆట‌గాడు. అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్‌లోనే నితీశ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 298 ప‌రుగులు చేశాడు. టెస్టుల్లో నితీశ్ కుమార్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 114.

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా రూ. 25 లక్షల చెక్కును అందించారు. నితీష్ తన తండ్రి ముత్యాల రెడ్డితో కలిసి ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సంద‌ర్భంగా బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో నితీశ్ సాధించిన సెంచ‌రీకి గుర్తుగా చెక్కును అందజేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు.

Also Read: Delhi Ranji Trophy: ఢిల్లీ రంజీ జ‌ట్టుకు కెప్టెన్‌గా రిష‌బ్ పంత్.. కోహ్లీ ఆడ‌టంలేదా?

ఈ సిరీస్‌లో వీరోచిత సెంచరీతో త‌న‌లో ఉన్న ప్రతిభను క్రికెట్ ప్ర‌పంచానికి చూపాడు. అతని సహకారాన్ని గుర్తిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) రూ.25 లక్షల రివార్డును ప్రకటించింది. ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్కును అందజేసేందుకు సహకరించారు. ఈ ఘటన అనంతరం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో యువ క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించారు.

తన ట్వీట్‌లో.. నేను ఈ రోజు మన అసాధారణ ప్రతిభావంతులైన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని కలిశాను. అతను తన ప్రదర్శన ద్వారా ప్రపంచ వేదికపై భారతదేశం గర్వపడేలా చేసిన తెలుగు స్టార్. నితీశ్‌ తల్లిదండ్రులను కూడా అభినందించాను. నితీశ్ కుమార్ రెడ్డి కెరీర్‌ను రూపుమాపడంలో వారి త‌ల్లిదండ్రుల మద్దతు అద్భుతంగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో నితీశ్‌ మరిన్ని సెంచరీలు సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయ‌న నితీశ్‌తో భేటీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

  Last Updated: 16 Jan 2025, 09:50 PM IST