Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో తన తమ్ముడు రామ్మూర్తినాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన సోదరుడి కుమారులైన రోహిత్, గిరీష్‌ను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
ఇకపోతే..నారావారిపల్లెలో రేపు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువెళ్లనున్నారు. అక్కడి నుండి నారావారిపల్లికి తరలిస్తారు. ఈ మేరకు రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా రామ్మూర్తి నాయుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్పించగా ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అకస్మాత్ముగా ఆయన చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక రామ్మూర్తి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ మంత్రి నారాయణ రామ్మూర్తి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Also: Manipur : మణిపూర్‌లో ఉద్రిక్తతలు..భద్రతా బలగాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు