Site icon HashtagU Telugu

CM Chandrababu : సింగపూర్‌లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (జులై 29) రోజును పూర్తిగా వృత్తిపరమైన సమావేశాలతో గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉదయం యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సమావేశంలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత సేవలు, క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై చర్చించనున్నారు.

Read Also: Kalpika : బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో కల్పిక వివాదం.. ఆమె ఏమంటోంది?

జపాన్‌కు చెందిన మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. మైక్రోఎలక్ట్రానిక్స్ రంగంలో తయారీ యూనిట్లు, పరిశోధన కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక, ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీలో ప్రఖ్యాతి గాంచిన క్యారియర్ సంస్థ ప్రతినిధులతో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరగనున్నాయి. తర్వాత వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై దృష్టి సారిస్తారు. ఇంకా ఉదయం 9.30 గంటలకు షాంగ్రీలాలో జరుగనున్న బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్ రంగాలపై చర్చ జరుగుతుంది. ఎస్‌టీటీ జీడీసీ, ఆరియన్‌ప్రో, ఆంకోషాట్, జీటీఎఫ్‌ఎన్, ఫాథమ్ ఎక్స్ వంటి సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.

మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. సింగపూర్‌తో మౌలిక సదుపాయాల భాగస్వామ్యం, పెట్టుబడులపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌తో భేటీ ఉంటుందనరు. ఇందులో పారదర్శక పాలన, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో సింగపూర్ అనుభవాన్ని ఏపీకి ఎలా చేర్చాలనే అంశంపై దృష్టి పెట్టనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్‌ను సందర్శించనున్నారు. పరిశ్రమల మధ్య నివాస ప్రాంతాలు, లాజిస్టిక్స్ హబ్‌ల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో భేటీ కానున్నారు. ఇందులో ఆటోమొబైల్ పార్కుల ఏర్పాటుపై చర్చలు జరుగుతాయి. చివరగా, బిజినెస్ నెట్‌వర్కింగ్ విందులో పాల్గొంటారు. ఇందులో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో కలిసి ముఖ్యమంత్రి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ పెట్టుబడులపై చర్చించనున్నారు. సమగ్రంగా చూడగా, ఈ పర్యటనలో మూడో రోజు కూడా చంద్రబాబుకు పూర్తిగా సమావేశాలతో నిండినవే. రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల రాకకు మార్గం సుగమం చేయాలనే దిశగా ఆయన చొరవగా ముందుకు సాగుతున్నారు.

Read Also: Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!

 

Exit mobile version