Green Hydrogen Valley : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి రాష్ట్రాన్ని “గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ”గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం సోమవారం అమరావతిలో ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ – అమరావతి డిక్లరేషన్’ను విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ విజయానంద్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ రూపకల్పనకు నేపథ్యంగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిలిచింది. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సులో దేశ-విదేశాల నుంచి సుమారు 600 మంది పరిశ్రమల ప్రతినిధులు, ప్రఖ్యాత గ్రీన్ ఎనర్జీ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు పాల్గొన్నారు. మొత్తం 7 సెషన్లుగా సాగిన చర్చల అనంతరం ప్రభుత్వం ఈ డిక్లరేషన్‌ను రూపొందించింది.
Read Also: IND vs ENG: నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
డిక్లరేషన్‌లో ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను పేర్కొన్నారు. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో 2029 నాటికి ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కిలో గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ ఖర్చు సుమారు రూ.460గా ఉండగా, దీన్ని రూ.160కు తగ్గించేలా ప్రభుత్వం పరిశోధనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది. ఇందుకోసం రూ.500 కోట్లు పెట్టుబడి ఖర్చు చేయనున్నట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2029 నాటికి 25 గిగావాట్ల సామర్థ్యం కలిగిన రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు 50 స్టార్టప్‌లను గుర్తించి, వాటికి నిధులు, మౌలిక వసతులు, సాంకేతిక మార్గదర్శకత వంటి సహాయాన్ని అందించనున్నట్లు డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. యువత కోసం ఉపాధి అవకాశాలు, పరిశోధన కేంద్రాలు, స్కిల్లింగ్ హబ్‌లను కూడా ఏర్పాటుచేయాలన్న ప్రణాళికను ప్రకటించారు. ఈ డిక్లరేషన్ ద్వారా దేశంలో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందుండేలా ప్రభుత్వ ప్రయత్నాలు స్పష్టమవుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ గ్లోబల్ హబ్‌గా ఎదగాలన్న సీఎం చంద్రబాబు కల సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని ఈ ప్రకటన కలిగించింది.
Read Also: Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?