Site icon HashtagU Telugu

CM Chandrababu : కుప్పం అభివృద్ధికి బిగ్ బూస్ట్.. సీఎం చంద్రబాబు సమక్షంలో 6 ఎంఓయూలు

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో పెద్ద అడుగు వేశారు. ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఆరు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. పలు రంగాల్లో విశిష్టత కలిగిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో, ఈ నియోజకవర్గం పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఏజీఎస్-ఐటీసీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. కుప్పం పరిధిలో “వెస్ట్ టు వెల్త్” కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీని కింద 15 ఏళ్ల పాటు ఇంటింటికీ వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రచారం చేయడం, పాఠశాలల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Changes In September: సెప్టెంబర్‌లో మనం చేయాల్సిన ముఖ్య‌మైన ప‌నులీవే!

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో షీలీడ్స్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యంలో 10 వేల మంది మహిళలకు పారిశ్రామిక శిక్షణ ఇచ్చి, వారిని కొత్త ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను గ్రామీణ మార్కెట్లలో విస్తృతంగా మార్కెటింగ్ చేయడంలో సహకరించనున్నారు. కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కుప్పంలో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.1,100 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పడనున్న ఈ యూనిట్ ద్వారా 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది కుప్పం పరిశ్రమల రంగానికి పెద్ద ఉత్సాహాన్నిచ్చే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ సంస్థ 2 సీటర్ల ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.150 కోట్ల పెట్టుబడితో ప్రతి సంవత్సరం 70 నుండి 100 వరకు శిక్షణ విమానాలను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో 250 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. బెంగళూరుకు చెందిన ఎత్రెయాల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో కూడా ఒక కీలక ఒప్పందం కుదిరింది. “రేజర్ క్రెస్ట్ ఎంకె-1” మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ తయారీ కోసం రూ.500 కోట్ల పెట్టుబడి మూడు దశల్లో పెట్టనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతరిక్ష సాంకేతికత రంగంలో కుప్పం ఒక కీలక కేంద్రంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ కుప్పంలో అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో మామిడి, జామ, టమాటో వంటి పంటలకు పల్పింగ్ యూనిట్లు ఏర్పరచనున్నారు. దీని ద్వారా సుమారు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. రైతుల పంటలకు విలువ పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.

Asia Cup 2025: ఆ ఐదుగురు ఆట‌గాళ్లు లేకుండానే దుబాయ్‌కు టీమిండియా?!

Exit mobile version