ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు.
ఈ అరుదైన క్షణాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కల్తీ లేదు… కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది” అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తాటి ముంజలు అమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం దంపతులు అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, అప్యాయతలపై స్థానికులు ప్రశంసలు కురిపించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
