Gates Foundation: రేపు (బుధవారం) ఢిల్లీ వేదికగా మైక్రోసాఫ్ట్ అధినేత, అపర కుబేరుడు బిల్‌గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈసందర్భంగా ఐదు కీలక రంగాలకు సంబంధించి బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ సర్కారు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య రంగం, విద్యారంగం, పరిపాలనా విభాగం, వ్యవసాయ రంగం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందించనుంది. వీటితో పాటు మరిన్ని అంశాల్లోనూ సాంకేతిక సహకారాన్ని ఫౌండేషన్ అందిస్తుంది.
Also Read :Indian Breads : టాప్-50 బ్రెడ్లలో 8 మన దేశానివే.. నంబర్ 1 మనదే
ఆరోగ్య సేవల రంగంలో..
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) పథకం ఏపీలో అమలవుతోంది. త్వరలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ కమాండ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా కేంద్రీకృత, సమీకృత కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత చికిత్సలను అందిస్తారు. ప్రజల వ్యక్తిగత ఆరోగ్య చరిత్రలను రూపొందిస్తారు. ఈవివరాలను గేట్స్ ఫౌండేషన్ ఇప్పటిదాకా సేకరించిన వ్యక్తిగత ఆరోగ్య డేటాతో క్రోడీకరిస్తారు. ఏపీ మెడ్‌టెక్ జోన్‌తో గేట్స్ ఫౌండేషన్ చేతులు కలపనుంది. తద్వారా టెలీ మెడిసిన్ వేదికలను మరింత సమర్థవంతంగా అందించనుంది.
విద్యారంగంలో..
విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) ప్రోత్సహించనుంది. ఇందుకు అవసరమైన విధానాలను, బోధనాంశాలను, సాంకేతిక వసతులను సమకూర్చనుంది. దీనివల్ల దీర్ఘకాలలో ఏపీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
పరిపాలనా విభాగంలో..
ఏపీలో డేటా లేక్ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సాయాన్ని గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. ప్రభుత్వ పాలనా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు చేదోడును అందించనుంది.
వ్యవసాయ రంగంలో..
వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఎలా వాడాలి ? ఏఐ టెక్నాలజీతో రైతులు ఎలా లబ్ధి పొందాలి ? అనే అంశాలపై ఏపీ రైతులకు అవగాహన కల్పించేందుకు గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందించనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక సామగ్రిని కూడా అందిస్తుంది. పంట దిగుబడులు పెంచుకునేందుకు అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులను సైతం నేర్పుతుంది. ఏపీ స్పేస్ అప్లికేషన్స్ శాటిలైట్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు గేట్స్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రైతులు వ్యవసాయ రంగంలో వికాసం కోసం శాటిలైట్ టెక్నాలజీని నేరుగా వాడుకోవచ్చు.
ఉద్యోగ కల్పనలో..
ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందిస్తుంది. ఏఐ టెక్నాలజీని యువతకు చేరువ చేసే దిశగా ఏపీ సర్కారు చేసే ప్రయత్నాలకు సాంకేతిక చేదోడును అందిస్తుంది.