CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చోటుచేసుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో నెలకొన్న చీకటి యుగానికి తెరపడిందని, రాష్ట్ర ప్రజలు నూతన ఆశతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మనం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయి. గత పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Read Also: TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్‌కు కొత్త మార్గదర్శకాలు
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన ముఖ్యమైన సందేశం ఇచ్చారు. పార్టీ ప్రతి నాయకుడి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. అదే సమయంలో పార్టీకి లేదా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలిపోకూడదు. ప్రతి ఆరు నెలలకు వారి పనితీరుపై సమీక్షలు జరుగుతాయి” అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, ‘తల్లికి వందనం’ స్కీం కింద ఈ నెల 12 లేదా 14 లోపు లబ్దిదారులకు నగదు అందజేస్తామని ప్రకటించారు. మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్న ఈ ప్రభుత్వం తల్లుల పట్ల గౌరవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఒక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నారు. అదే రోజున సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, అధికారులు కలిసి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే నాలుగేళ్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. “రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ఎవరు అడ్డుపడినా మన ప్రయాణం ఆగదు. ప్రజలు అన్నీ గమనిస్తారు. తప్పుడు ప్రవర్తనను మేము సహించం. మీరు నిజాయితీగా పనిచేస్తే, పార్టీతో పాటు ప్రజల మన్నన పొందుతారు” అంటూ చంద్రబాబు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలన్నీ టీడీపీ భవిష్యత్తు దిశలో సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.