పెనమలూరు (Penamalur) నియోజకవర్గంలోని గంగూరు రైతు సేవా కేంద్రాన్ని(Gangur Rythu Seva Kendram) శుక్రవారం సీఎం చంద్రబాబు (CMChandrababu) పరిశీలించారు. ధాన్యం సేకరణ విధానాన్ని తనిఖీ చేసి, రైతుల నుండి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఉత్పత్తి పెంచి, రైతులకు శ్రమను తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తీసుకురావడమే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
తేమశాతం నిర్ధారణపై పరిశీలన :
రైతుల నుండి సేకరించిన ధాన్యానికి తేమశాతం గణనకు కచ్చితత్వం ఉండాలని సీఎం సూచించారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం తేమశాతాన్ని స్వయంగా పరిశీలించి, మిల్లులో కూడా అదే రీడింగ్ రావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తేమశాతంలో మార్పు వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు షెడ్యూలింగ్ :
ప్రోక్యూర్మెంట్ ప్రక్రియకు సంబంధించి రైతులు, సేవా కేంద్రం సిబ్బందితో సీఎం చర్చించారు. పంట కోత షెడ్యూలింగ్ పూర్తిగా ఒకేసారి లేదా పార్ట్‌షెడ్యూల్‌గా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పంట దిగుబడికి సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, రైతులకు స్పష్టమైన గైడెన్స్ అందించాలన్నారు.
సకాలంలో నీటి అందుబాటుపై దృష్టి :
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సకాలంలో నీటిని అందించడం జరుగుతుందని సీఎం అన్నారు. కాలువల్లో పూడికతీత చేపట్టాలని, ఎంక్రోచ్‌మెంట్ తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు నష్టపోయే రైతులకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. భూమి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు తెలిపారు.
రైతుల అభ్యున్నతికి సీఎం చర్యలు :
రైతులకు టార్పాలిన్ పరదాలు పంపిణీ చేసి, ధాన్యం ఆరబెట్టడం సులభం చేసే ఏర్పాట్లు చేస్తామని సీఎం అన్నారు. రైతులకు డ్రయర్ మిషన్లు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పొలం వద్దనే సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పంటల మార్కెటింగ్, డిమాండు వివరాలను రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే తన సందర్శన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also : CM Revanth Open Challenge : తెలంగాణ భవన్ కే వస్తా..దమ్ముందా కేటీఆర్
