ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు అడుగులు వేసింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన “సూపర్ సిక్స్” పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను ఆగస్టు 15నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
PJR flyover : వాహనదారులకు ఊరట..పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉన్నందున, అవసరమైన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, లేదా అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఇకపై అన్ని కొత్త బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా ఉండాలని, ఇప్పుడున్న డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి బస్సులో GPS తప్పనిసరిగా అమర్చాలని చెప్పారు.
అంతేకాదు, ఆర్థికంగా కష్టాలున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉచిత బస్సు పథకం అమలుకు 2,536 అదనపు బస్సులు అవసరమవుతాయని, రూ.996 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఉచిత పథకం అమలుతో మహిళల వార్షిక ప్రయాణాల సంఖ్య 88.90 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ మేరకు పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం కీలకమవుతుంది.