బ్లాక్ బర్లీ పొగాకు (Black Burley Tobacco) రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు, రైతులు మరియు బయ్యర్లతో జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం, కొనుగోలు ప్రక్రియపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా బ్లాక్ బర్లీ పొగాకును రెండు గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కామన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 12,000 మరియు లో గ్రేడ్ కు రూ. 6,000 ధరగా నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు వచ్చినా నిర్ణయించిన ధరలను తప్పకుండా అమలు చేయాలని కంపెనీలకు సూచించారు.
Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
పొగాకు కొనుగోలులో ప్రాసెసింగ్ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు పండించిన చివరి ఆకును కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనికోసం ఆరు సబ్‌కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కంపెనీలు రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఫోన్ చేసినప్పుడు స్పందించకపోతే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ధైర్యం కల్పించేందుకు, వారిని సంక్షోభం నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అచ్చెం నాయుడు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధిగా రూ.130 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఈ నిధిలోంచి ఇటీవల టమోటా రైతులను కూడా ఆదుకున్నామని గుర్తుచేశారు. అదే విధంగా బ్లాక్ బర్లీ పొగాకు రైతులకూ సహాయం అందించాలని కంపెనీలు బాధ్యతతో ముందుకు రావాలని, కొనుగోలు ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని మంత్రి కోరారు.