CM Chandrababu: మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి దగ్దమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షణాల్లో అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు.
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎంఓ, డీజీపీ, సీఐడీ చీఫ్‌లతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో అసైన్డ్ భూములకు సంబంధించిన పలు దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. అయితే ఇది ప్రమాదమా లేక కుట్రనా అనే కోణంలో చంద్రబాబు అధికారుల్ని ప్రశ్నించారు. ఈ రోజు సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీని సీఎం కోరారు. మరికొద్ది గంటల్లో డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లెకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏదైనా కుట్ర జరిగిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ సాగనుంది.
కాగా నిన్న అర్ధరాత్రి కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అర్ధరాత్రి సమయం వరకు తాను కార్యాలయంలో ఉండటానికి గల కారణాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విచారణ చేపట్టాలని సీఎం సూచించారు. సీసీ కెమెరా దృశ్యాలు సేకరించి ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టకూడదని హెచ్చరించారు. దాంతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించాలన్నారు.
Also Read: YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్ మధ్య వాగ్వాదం
