ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
అది ఏలూరులోని పోలీస్ స్టేషన్.. భార్యాభర్తలు అక్కడికి వచ్చి పోలీసులను సంప్రదించారు. తమ 15 ఏళ్ల కొడుకుపై వాళ్లిద్దరూ ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందో చెప్పమనగానే అసలు సంగతి పోలీసులకు వివరించారు. తమ కుమారుడిని రక్షించాలంటూ వేడుకున్నారు. అదేంటి సొంత కొడుకుపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం అని అనుకుంటున్నారా? కొడుకు చేస్తున్న ఘనకార్యాలు చూసి విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ బాలుడిని ఎలాగైనా మార్చాలనుకుని శక్తి టీమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఏలూరుకు చెందిన 15 ఏళ్ల బాలుడు కొంతకాలంగా మొబైల్‌కు బానిసగా మారాడు. ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాత్రంతా గేమ్స్ ఆడుతూ పగటిపూట మాత్రం నిద్రపోతున్నాడు. మొబైల్‌కు బానిసైన బాలుడు సరిగా చదవడం లేదు.. గతంలో స్కూల్‌కు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు బాలుడి ప్రవర్తనలో కొన్ని మార్పుల్ని గమనించారు. మొబైల్ వాడకాన్ని తగ్గించి చదువుకోమని ఎన్నో సందర్భాల్లో నచ్చజెప్పారు. మనోడు మాత్రం తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా వారిపై తిరిగి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా తల్లిదండ్రులపై చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు.
కొడుకు పరిస్థితిని చూసి కంగారుపడిన తల్లిదండ్రులు.. బిడ్డ ఏమైపోతాడోనని భయంతో ఏలూరు శక్తి టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ సుబ్బారావు రంగంలోకి దిగారు.. తమ సిబ్బందిని పంపించి ఆ బాలుడ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. బాలుడ్ని తల్లిదండ్రులతో పాటు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడని గుర్తించి తల్లిదండ్రులకు చెప్పి ఏలూరు ప్రభుత్వం ఆస్పత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్చారు. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని.. వారిని వీలైనంత వరకు మొబైల్‌కు దూరంగా ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ పిల్లల్లో ఏవైనా మార్పులు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లాలో మరో విషాద ఘటన జరిగింది. మొబైల్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నావంటూ తండ్రి మందలించాడనే కోపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నూజివీడు మండలం రామన్నగూడెంకు చెందిన సత్యపవన్‌కుమార్ తన భార్య, పిల్లలతో టి నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెంలో వ్యవసాయ కూలీగా పనులు చేస్తున్నారు. పవన్‌కుమార్ పెద్ద కుమారుడు డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్నారడని తండ్రి మందలించాడు. ఆవేశంలో ఆ యువకుడు తోటలో ఉన్న కలుపు మందు తాగాడు.. వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
