CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అందుబావుతో సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలోనే, ఆయన నేరుగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
Read Also: Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు
ఈ అభివృద్ధికి కారణం ముఖ్యమంత్రి చొరవేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన అధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణమే కేటాయించిన యూరియాను జిల్లాలవారీగా తరలించాలని ఆదేశించారు. ముఖ్యంగా అవసరమైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే, ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను చట్టవ్యతిరేకంగా నిల్వ చేసినా, విక్రయించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. దీనితో పాటు కేంద్రం నుంచి వచ్చిన 17,293 మెట్రిక్ టన్నులు చేరితే, రైతుల తాత్కాలిక అవసరాలకు సరిపోతుందని చెప్పారు.
రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మొత్తం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించబడినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు స్పష్టంగా సూచనలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో అధికారులు రైతులను కలిసేలా చేయాలని, వారి అవసరాలు తెలుసుకొని తగిన సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా రైతుల్లో ఆందోళన పెరగకుండా, వారికి ధైర్యం చెప్పే విధంగా వ్యవహరించాలన్నారు. ఇక, నుంచి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని, ప్రభుత్వ కృషి రైతుల కోసం అంకితమైందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేరుగా కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్తు అవసరాలను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.
Read Also: Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు