Center Govt Help AP and Telangana Due to Floods: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith sha) వెల్లడించారు.
ఇప్పటికే వరద ప్రాంతాలలో నిపుణుల బృందం పర్యటన..
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై ఎక్స్ ద్వారా కేంద్రం వివరాలు వెల్లడించింది. ప్రధాని ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందజేయనున్నట్లు తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాప్టర్లు ఉన్నాయని హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఏపీలో 350 మందిని రక్షించినట్లు, 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు..
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తున్నప్పటికీ.. వరద బాధితులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో కేంద్రం నుంచి సహాయం చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మరో వైపు కేంద్ర మంత్రులు కూడా ప్రధానికి విన్నవించారు. దీంతో నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఏపీలో పర్యటించారు. వరద నష్టం పై ఆరా తీశారు. ఇవాళ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తాజాగా సెక్రెటేరియట్ వద్దకు చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం చేసింది. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టు ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.