ఏపీలో ఎన్నికల ఫలితాలన్నీ కూటమికే జై కొట్టాయి. ఎవరు ఊహించని రీతిలో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఇక ఏపీ సీఎం గా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ అనే మాటను ఎప్పుడెప్పుడు వినటమే అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. మరికాసేపట్లో 4 వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకారం వేదిక ఏర్పాటైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, జితన్ రామ్, చిరాగ్ పాస్వాన్, గడ్కరీ, జయంత్ చౌదరి, రామిస్ అథవాలే, అనుప్రియా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సీఎంలు ఏక్నాథ్ శిండే (మహారాష్ట్ర), మోహన్ యాదవ్ (మధ్య ప్రదేశ్), మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు ఉన్నారు.
సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు తెలుగు శ్రేణులు. మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపరించేలా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్దం చేయడమే కాదు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 10 వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నగరంలో 3 వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు.
Read Also : Ministers: ఏపీ మంత్రుల జాబితా ఇదేనా..! చంద్రబాబు మంత్రివర్గంలో కాబోయే మినిస్టర్స్ వీరేనా..?