CBN-Daggupati : తోడ‌ళ్లుల్ల మ‌ధ్య జ‌గ‌న్ స్కెచ్! ద‌గ్గుబాటి ఆప్తుడికి ప‌ర్చూరు

జ‌గ‌న్ స్కెచ్ బాబు,వెంక‌టేశ్వ‌ర‌రావు(CBN-Daggupati) మీద ప‌నిచేసింది.

  • Written By:
  • Updated On - January 16, 2023 / 02:08 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్కెచ్ తోడ‌ళ్లుల్లు చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు(CBN-Daggupati) మీద ప‌నిచేసింది. కొన్ని నెల‌ల క్రితం వాళ్లిద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో కెమెరాకు చిక్కారు. దీంతో ద‌శాబ్దాల‌పాటు మాట‌ల్లేని వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌వుతున్నార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ(TDP) త‌ర‌పున వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు హితేష్ చెంచురామ్ ప‌ర్చూరు నుంచి బ‌రిలోకి దిగుతార‌ని చ‌ర్చ న‌డిచింది. కానీ, ప‌ర్చూరు వైసీపీ ఇంచార్జిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ నియామ‌కాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన త‌రువాత‌ ద‌గ్గుబాటి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని టాక్‌. ఆ క్ర‌మంలోనే రాజ‌కీయాల‌కు దూరమంటూ తాజాగా ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించార‌ని కొంద‌రు స్థానిక నేత‌లు భావిస్తున్నారు. ఆయ‌న తో పాటు ఆయ‌న కుమారుడు హితేష్ కూడా రాజ‌కీయాల‌కు గుడ్ బై అంటూ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

తోడ‌ళ్లుల్లు చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు(CBN-Daggupati)

ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పురంధ‌రేశ్వ‌రి ఉన్నారు. ఆమె బీజేపీలో ఉన్న‌ప్పుడే వైసీపీ నుంచి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆయ‌న కుమారుడు హితేష్‌ రాజ‌కీయాలు నెరిపారు. 2019 ఎన్నిక‌ల్లో ప‌ర్చూరు నుంచి కుమారుడి కోసం ఆయ‌న విజ‌యాన్ని అందుకోలేక‌పోయారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మ‌న‌వ‌రాలి పెళ్లి సంద‌ర్భంగా చంద్ర‌బాబు, వెంక‌టేశ్వ‌ర‌రావు(CBN,Daggupati) మాట్లాడుకున్నారు. దీంతో టీడీపీ(TDP)లోకి ద‌గ్గుబాటి కుటుంబం వెళ్ల‌నుంద‌ని బాహాటంగా ప్ర‌చారం జ‌రిగింది. హ‌ఠాత్తుగా చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ను ప‌ర్చూరు ఇంచార్జిగా వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియ‌మించారు. దీంతో ప‌ర్చూరు నుంచి దగ్గుబాటి కుటుంబం రాజ‌కీయంగా దూరం అయింది.

ప‌ర్చూరు  వైసీపీ అభ్య‌ర్థిత్వాన్ని ఆమంచికి ..

మాజీ ఎమ్మెల్యే ఆమంచి, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప‌క్క‌ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాలైన చీరాల‌, ప‌ర్చూరు రాజ‌కీయాల‌ను ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో న‌డిపారు. సామాజిక‌వ‌ర్గం ప‌రంగానూ వాళ్లిద్ద‌రికీ ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లిసొచ్చింది. తొలి నుంచి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఎన‌లేని గౌర‌వాన్ని ఆమంచి ఇస్తుంటారు. పైగా చీరాల ఎమ్మెల్యే బ‌ల‌రామ‌క్రిష్ణ మూర్తి ఇద్ద‌రికీ ఉమ్మ‌డి రాజ‌కీయ శ‌త్రువు. ప్ర‌స్తుతం బ‌ల‌రాం వైసీపీ పంచ‌న ఉన్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమారుడు వెంక‌టేష్ కు చీరాల అభ్య‌ర్థిత్వాన్ని వైసీపీ త‌ర‌పున తీసుకోవాల‌ని యోచిస్తున్నారు. ఆ క్ర‌మంలో ప‌ర్చూరు అభ్య‌ర్థిత్వాన్ని ఆమంచికి వైసీపీ ఇచ్చేసింది. దీంతో ఆప్తుడుగా ఉన్న ఆమంచికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి ద‌గ్గుబాటి నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : Daggubati : చంద్ర‌బాబు చాణక్యంతో `ద‌గ్గుబాటి` డైల‌మా

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ, బీజేపీ మ‌ధ్య తెర వెనుక క్విడ్ ప్రో కో రాజ‌కీయాన్ని న‌డుస్తోంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీని ఆ రెండు పార్టీలు శ‌త్రువుగా భావిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ త‌ర‌పున హితేష్ చెంచురామ్ ను పోటీకి దింప‌డం సాహ‌సం అవుతోంది. పైగా పురంధ‌రేశ్వ‌రి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండ‌డంతో రాబోవు రోజుల్లో అవ‌స‌ర‌మైతే టీడీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డం మేల‌ని ద‌గ్గుబాటి భావించార‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని కొంద‌రి భావ‌న‌. వాస్త‌వంగా ఆయ‌న 2019 ఎన్నిక‌లకు ముందుగానే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి అంటూ ప్ర‌కటించారు. కుమారుని రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మాత్ర‌మే ఆ ఎన్నిక‌ల తెర మీద క‌నిపించారు. అప్పుడు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్పుడు గ‌ట్టిగా వినిపిస్తున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు చెబుతున్నారు.

Also Read : Daggubati Purandeshwari: మోడీ కేబినెట్‌లోకి దగ్గుబాటి పురందేశ్వరి?

సుదీర్ఘ రాజ‌కీయాల‌ను ఎలాంటి మ‌చ్చ‌లేకుండా న‌డిపిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేక‌పోతున్నారు. పైగా ఏపీ రాజ‌కీయాలు, నేత‌ల మాట‌లు హ‌ద్దులు దాటి పోయాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసింది. అలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం స‌హ‌జంగా ద‌గ్గుబాటి మ‌న‌స్త‌త్వానికి ప‌డ‌దని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ఎవ‌రైనా భావిస్తారు. కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌డం వెనుక ఆమంచికి ప‌ర్చూరు బాధ్య‌త‌లను అప్ప‌గించ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని కొంద‌రు విశ్వ‌సిస్తున్నారు. దీంతో ద‌గ్గుబాటి టీడీపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారానికి శాశ్వ‌తంగా తెర‌ప‌డింది. అలాగే, తోడ‌ళ్లుల్లు చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి మ‌ళ్లీ క‌లుసుకునే అవ‌స‌రం కూడా రాజ‌కీయంగా ఉండ‌ద‌న్న‌మాట‌.