Vangaveeti Radha: వంగవీటి రాధ ఏం చేయబోతున్నారు ? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. వంగవీటి రాధ 2009లో వైఎస్సార్ సీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ గూటికి చేరారు. అయితే అప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. టీడీపీ గెలిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. 2019 నుంచి 2024 వరకు వంగవీటి రాధ టీడీపీలోనే కొనసాగారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా టీడీపీ కోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేశారు. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాధా ఎన్నికల ప్రచారం సాగింది. జనసేన, టీడీపీ, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అయినా నేటికీ వంగవీటి రాధకు ఏ పోస్టూ రాలేదు. ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతున్నా.. ఆ దిశగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు.
Also Read :Shah Rukh Message: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షారుక్ కీలక సందేశం
పార్టీలు మారినా పదవులు దక్కలేదని..
అటు వైఎస్సార్ సీపీలో ఉండగా.. ఇటు టీడీపీలో ఉండగా వంగవీటి రాధకు పదవులు ఏవీ దక్కలేదు. దీంతో నైరాశ్యానికి గురైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని అనుకుంటున్నట్లు పలువురు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులోని వాస్తవికతను మేం ధ్రువీకరించడం లేదు. రాజకీయాలను ఇక వదులుకుంటానని ఏ సందర్భంలోనూ వంగవీటి రాధ స్వయంగా వెల్లడించలేదు. సొంత అంచనాలతో టీడీపీ వ్యతిరేక మీడియా ఈ తరహా కథనాలను వండివారుస్తోంది. టీడీపీ నేతలు, క్యాడర్ గురించి తప్పుడు ప్రచారానికి పూనుకుంటోంది. వాస్తవానికి ఈసారి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ క్యాడర్, నేతలు జోష్‌లోనే ఉన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ సారథ్యంలో ప్రజలతో మరింతగా మమేకం అవుతున్నారు. టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి తగిన అవకాశాలను కల్పించే విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎన్నడూ వెనుకాడలేదు. కొన్నిసార్లు పలుచోట్ల నేతలకు కీలక అవకాశాలను కల్పించడంలో కొంత జాప్యం జరుగుతుంటుంది. దాన్ని ఉద్దేశపూర్వక చర్యగా పేర్కొంటూ తప్పుడు కథనాలను ప్రచురించడం సరికాదు అని టీడీపీ అగ్రనేతలు అంటున్నారు.
క్లారిటీ ఇచ్చిన వంగవీటి రాధ మిత్రుడు
విజయవాడకు చెందిన వంగవీటి రాధ(Vangaveeti Radha) మిత్రుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ‘‘రాధా రాజకీయాలకు దూరం కాలేదు. ఆయనకు అలాంటి ఆలోచనేం లేదు. టీడీపీలో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. రాధాకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. అప్పటివరకు ఓపికగా ఉంటాం. కొందరు ఈవిషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల కొంతకాలం యాక్టివ్‌గా లేరు అంతే’’ అని రాధ మిత్రుడు తేల్చి చెప్పారు.