Nellore Cow : పంటలు పండించడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, కాసుల పంట పండించడం ఎప్పుడైనా చూశారా? ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన ఓ వేలం పాటలో ఒక గోవు సంచలన రికార్డు నెలకొల్పింది. నెల్లూరు (ఒంగోలు) జాతికి చెందిన ఈ గోవు ఏకంగా 4.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.40 కోట్లు) పలికి అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యధిక ధరకు అమ్ముడైన గోవుగా ఇది గిన్నిస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది.
ఈ అరుదైన గోవును ‘వియాటినా-19’ అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ ప్రాంతంలో ఇటీవల జరిగిన వేలంలో ఇది అత్యధిక ధరకు అమ్ముడైంది. సుమారు 1,101 కిలోల బరువుతో వియాటినా-19 సాధారణ నెల్లూరు జాతి ఆవుల కంటే రెట్టింపు బరువుతో ఉన్నట్టు వెల్లడించారు. జాతి పరంగా దీనికి ఉన్న ప్రత్యేకతలు, అనుకూల లక్షణాలు దీన్ని అంతగా విలువైనదిగా మార్చాయి.
ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన జన్యువులు కలిగిన ఆవుగా గుర్తింపు పొందింది. అంతేకాదు, వియాటినా-19 గతంలో ‘మిస్ సౌత్ అమెరికా’ అనే టైటిల్‌ను కూడా గెలుచుకుంది. కండరాల నిర్మాణం, రోగనిరోధక శక్తి, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన జాతిగా నిలిపాయి.
BC Caste Enumeration : బీసీ కులగణన చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం
వియాటినా-19 ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే, ఇది చెందిన నెల్లూరు జాతి (ఒంగోలు గోరు) గురించే ముందుగా తెలుసుకోవాలి. ఈ జాతి భారతదేశానికి చెందినది. 18వ శతాబ్దం చివరలో బ్రెజిల్‌కు ఈ జాతిని ఎగుమతి చేశారు. అక్కడ ఈ ఆవులను విశేషంగా అభివృద్ధి చేసి అత్యంత విలువైన జాతిగా తీర్చిదిద్దారు.
ఈ గోవులు తీవ్ర వేడిని తట్టుకునే సామర్థ్యం, రోగనిరోధక శక్తి, బలమైన కండరాల నిర్మాణం వంటి ప్రత్యేక లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెంచుకున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్, అర్జెంటీనా, ప్యారా గ్వే, మెక్సికో వంటి దేశాల్లో వీటికి విపరీతమైన గిరాకీ ఉంది.
వియాటినా-19ను అత్యధిక ధరకు కొనుగోలు చేసిన వ్యక్తి దీనిని పశు వ్యాపారానికి వినియోగించనున్నారు. ఈ గోవు నుంచి వచ్చే బ్రీడ్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసి మున్ముందు మరింత డబ్బు ఆర్జించేందుకు పశు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ వేలం పాట తర్వాత బ్రెజిల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు జాతి ఆవుల గిరాకీ పెరిగింది. ప్రధానంగా మాంస ఉత్పత్తికి, పాల దిగుబడికి అనుకూలంగా ఉండే ఈ ఆవులను బ్రెజిల్‌లో అత్యంత ప్రీమియం జాతిగా లెక్కిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ఈ భారీ డీల్ వల్ల పశు పరిశ్రమకు ప్రాధాన్యత మరింత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాంస, పాల ఉత్పత్తి కోసం అధిక సామర్థ్యం గల జాతులను అభివృద్ధి చేయడంపై ఆసక్తి పెరుగుతోంది. ఈ తరహా జాతి సంరక్షణ, జన్యుపరంగా మెరుగుదల వంటి అంశాలు సమర్థవంతమైన వ్యవసాయ మోడళ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఈ ఒంగోలు జాతి గోవు బ్రెజిల్‌లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారీ చర్చనీయాంశంగా మారింది. ఒక గోవుకు రూ.40 కోట్లు అంటే సగటు వ్యక్తి ఊహించలేనిది. కానీ, ఇందులో దాగిన గొప్పతనం, జాతి విలువ తెలియజేసే గొప్ప ఉదాహరణ ఇది. మన దేశానికి చెందిన ఒంగోలు గోరు జాతి ప్రాముఖ్యత మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చిన ఘట్టంగా ఇది నిలిచిపోయింది.
Telugu States : రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చబోతున్న ‘అమృత్ స్టేషన్ పథకం’