Site icon HashtagU Telugu

Bosta Vs Lokesh : వేడెక్కిన మండలి

Botsa Vs Lokesh

Botsa Vs Lokesh

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో (Andhra Pradesh Legislative Council Meetings) తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ప్రధానంగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామా అంశంపై పెద్ద చర్చ నడిచింది. వైసీపీ సభ్యులు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైస్ ఛాన్సలర్లను బెదిరించి రాజీనామా చేయించారని ఆయన మండలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఆయన ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు.

State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

లోకేష్ తన వాదనలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామా లేఖలను సభ ముందు ఉంచారు. బెదిరింపు జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారని, వాటిని గవర్నర్ ఆమోదించారని తెలిపారు. మరోవైపు బొత్స మాత్రం ఈ రాజీనామాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంత మంది ఒకేసారి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం అనుమానాస్పదమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో మాటల తూటాలు పేలాయి. లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ సభ్యులు భగ్గుమన్నారు. దీనికి ప్రతిగా టీడీపీ సభ్యులు కూడా తమ అభిప్రాయాలు తీవ్రంగా వ్యక్తం చేయడంతో సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సభ పరిస్థితి అదుపుతప్పింది. చైర్మన్ మోషన్ రాజు సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. అనంతరం సమావేశం తిరిగి ప్రారంభమైనప్పటికీ, వైసీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. విచారణ చేపట్టాలని పట్టుబట్టారు. ప్రభుత్వ తరఫున సమాధానం ఇవ్వాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే సభలో వివాదాలు కొనసాగడంతో చైర్మన్ చివరకు సభను రేపటికి వాయిదా వేశారు.