Site icon HashtagU Telugu

Botsa Health : బొత్స తాజాగా హెల్త్ అప్డేట్

Botsa Health Update

Botsa Health Update

ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) “వెన్నుపోటు దినం” (Vennupotu Dinam) సందర్భంగా చీపురుపల్లిలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎండలో ర్యాలీలో పాల్గొన్న బొత్స, అనంతరం వాహనంపై ప్రసంగిస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే స్పందించిన నేతలు, కార్యకర్తలు ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వడదెబ్బ కారణంగా ఇలా జరిగిందని తెలిపారు.

Morgan Stanley: 2030 నాటికి భారత్‌లో క్విక్ కామర్స్ మార్కెట్ $57 బిలియన్లకు చేరనుంది

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4ను “వెన్నుపోటు దినం”గా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వ హామీల అమలులో విఫలమయ్యిందని ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ స్వస్థలమైన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిరసన ర్యాలీలో కాలినడకన మూడు రోడ్లు జంక్షన్ వరకు నడిచి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించేందుకు వాహనంపై ఎక్కారు. అయితే గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఆయన, అధిక వేడి, అలసట వల్ల ఒక్కసారిగా శరీరం సహకరించక కింద పడిపోయారు.

ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని, శ్రేణులు ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని బొత్స అప్పల నర్సయ్య మీడియాకు తెలియజేశారు. కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఒకసారి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయబ్రాంతులకు గురైనా, ప్రస్తుతం పరిస్థితి చక్కగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. పార్టీ శ్రేణులు త్వరలోనే బొత్స పూర్తి ఆరోగ్యంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.