Botsa Anusha : ఉత్తరాంధ్ర రాజకీయాలకు కేరాఫ్ అయినా చీపురుపల్లి నియోజకవర్గం వేదికగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేశారు. గత కొంతకాలంగా ఆమె కేవలం తెర వెనుక మాత్రమే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా గరివిడిలోని క్యాంప్ కార్యాలయం కేంద్రంగా ఆమె కార్యకర్తలతో నేరుగా మమేకమవుతూ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. ఆమె భవిష్యత్తులో చీపురుపల్లి రాజకీయ వారసురాలిగా స్థిరపడనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మన కుటుంబం – మన కార్యకర్త’ అనే వినూత్న కార్యక్రమం ద్వారా గ్రామగ్రామాన పర్యటిస్తూ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో అనూష వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ను నియోజకవర్గంలో విజయవంతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇది ఆమె నాయకత్వ పటిమను రాష్ట్ర స్థాయి నేతలకు కూడా చాటిచెప్పింది. అలాగే, తన తండ్రి రాష్ట్రస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో, నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకుని కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చీపురుపల్లి బాధ్యతలను అనూషే చూసుకుంటారని బహిరంగంగా ప్రకటించడం ఆమె రాజకీయ అడుగులకు అధికారిక ముద్ర పడినట్లయింది.
బొత్స అనూష తన తల్లి బొత్స ఝాన్సీ బాటలోనే రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే, మొదట జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలనే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. గరివిడి లేదా గుర్ల మండలాల నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబానికి ఉన్న బలమైన నెట్‌వర్క్, తండ్రి రాజకీయ అనుభవం ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకుంటున్న అనూష, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
