BJP Game : రాజ‌కీయ బోనులోప‌డిన చంద్రం.!

BJP Game : `సింహం దాని స‌హ‌జ‌త్వాన్ని కోల్పోతే..`అంద‌రూ ఆడుకోవాల‌ని చూస్తారు.ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలోనూ అదే జ‌రుగుతోందని టీడీపీలోని బాధ‌.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 01:52 PM IST

BJP Game : `సింహం దాని స‌హ‌జ‌త్వాన్ని కోల్పోతే..`అంద‌రూ ఆడుకోవాల‌ని చూస్తారు. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలోనూ రాజకీయంగా అదే జ‌రుగుతోందని టీడీపీ కోట‌రీలోని బాధ‌. ఎందుకంటే, కేంద్రం అండ లేకుండా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక అడుగు కూడా ముందుకేయ‌లేరు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల మ‌ద్ధ‌తు లేకుండా చంద్ర‌బాబును జైలుకు పంపే సాహ‌సం ఆయ‌న చేయ‌లేరు. ఆ విష‌యం తెలుగు స‌మాజంలోని సామాన్యుల‌ను ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో రాజకీయాల‌కు అతీత‌మైన బంధం ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాహాటంగా ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు బీజేపీతో క‌లిసి న‌డ‌వాల‌ని ప్ర‌య‌త్నించ‌డమే తాజా అన‌ర్థానికి కార‌ణ‌మ‌ని టీడీపీ కోర్ టీమ్ భావిస్తోంది.

బీజేపీతో క‌లిసి న‌డ‌వాల‌ని ప్ర‌య‌త్నించ‌డమే తాజా అన‌ర్థానికి ..(BJP Game)

ఏపీ ప్ర‌జ‌లు బీజేపీని ఆద‌రించ‌డానికి సిద్ధంగా లేరు. రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ తో పాటు విభ‌జన చ‌ట్టం ప్ర‌కారం బీజేపీ వ్య‌వ‌హ‌రించ‌డంలేదని అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ట్టీ, నీళ్లు తెచ్చి ఇచ్చిన మోడీ అంటే ఏపీ స‌మాజానికి ప‌డ‌దు. అందుకే, ఆ పార్టీని ఏ మాత్రం ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. ఆ విష‌యం తెలుగుదేశం పార్టీకి తెలుసు. రాజ‌కీయంగా 40ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు ఆ విష‌యం తెలియ‌క కాదు. మ‌రి, ఎందుకు చంద్ర‌బాబు బీజేపీ పంచ‌న చేరాల‌ని భావించారు? అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. ఆయ‌న మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ పెద్ద‌ల సహ‌కారం అవ‌స‌ర‌మంటూ ఇటీవ‌ల కొన్ని వేదిక‌ల‌పై చెప్పారు.

బీజేపీ అనేది ఒక విషస‌ర్పం అంటూ తాజాగా ఉద‌య‌నిధి

బీజేపీ అనేది ఒక విషస‌ర్పం అంటూ తాజాగా ఉద‌య‌నిధి పోల్చారు. దాన్ని ఇంటిలోకి కాదుక‌దా, ప‌రిస‌రాల్లోకి కూడా రానివ్వ‌కూడ‌ద‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి ఇచ్చిన తాజా సందేశం. త‌మిళ‌నాడులో బీజేపీ ఏమి చేస్తుంది? అనేది ద‌గ్గ‌ర నుంచి చూసిన త‌రువాత ఆయ‌న ఆ మాటని ఉంటారు. ఆ మాత్రం చంద్ర‌బాబు గ్ర‌హించ‌లేదా? అంటే ఖ‌చ్చితంగా బీజేపీ పెద్ద‌లుగా ఉన్న మోడీ, అమిత్ షా సంగ‌తి తెలుసు. కానీ, అనివార్య ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు వాళ్ల‌కు లొంగారు. అటు వైపు నుంచి సానుకూల‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప‌దేప‌దే ప్రాధేయ‌ప‌డ‌డ‌మే ఆయ‌న జైలుకు వెళ్ల‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

బీజేపీని కింగ్ మేక‌ర్ చేయాల‌ని ఎప్పుడో స్కెచ్

తొలి నుంచి ఏపీలో కింగ్ మేక‌ర్, తెలంగాణ‌లో కింగ్ కావాల‌ని బీజేపీ ఆశిస్తోంది. తెలుగుదేశం పార్టీ బ‌లంగా ఉన్నంత కాలం బీజేపీకి అక్క‌డ స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి వెళ్లిపోయింది. క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకును బీజేపీ మ‌లుచుకోవ‌డం క‌ష్టం. అందుకే, చంద్ర‌బాబును టార్గెట్ చేయ‌డం ద్వారా బీజేపీని కింగ్ మేక‌ర్ చేయాల‌ని ఎప్పుడో స్కెచ్ వేశారు. అయితే, నేరుగా రంగంలోకి దిగితే రాజ‌కీయంగా న‌ష్ట‌పోతారు. అందుకే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద్వారా చంద్ర‌బాబును రాజ‌కీయంగా బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి ప్లాన్ చేశార‌ని టీడీపీకి ఎప్పుడో తెలుసు. అందుకే, బ‌ల‌మైన వాళ్ల‌తో ఢీ కొట్టే ధైర్యం చేయ‌లేక‌, ఒక ర‌కంగా చెప్పాలంటే కాళ్ల బేరానికి చంద్ర‌బాబు వెళ్లారు. స‌రిగ్గా ఇదే ఆయ‌న చేసిన త‌ప్పు.

Also Read : CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా

జాతీయ స్థాయి లీడ‌ర్ గా చంద్ర‌బాబుకు గుర్తింపు ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఇండియా కూట‌మి వైపు ఆయ‌న ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు రేణుకాచౌద‌రి, కేవీపీ త‌దిత‌రులు కూడా ఆయ‌న్ను ఆహ్వానించారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీ, షా ద్వ‌యాన్ని నిలువ‌రించాలంటే చంద్ర‌బాబు అవ‌స‌రం ఉంద‌ని వాళ్లు భావించారు. అంతేకాదు, చిర‌కాల మిత్రునిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ , బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా ఇండియా కూట‌మిలో కీల‌కంగా ఉన్నారు. వాళ్ల‌తో క‌లిసి చంద్ర‌బాబు ప్ర‌యాణం చేసి ఉంటే, ఇప్పుడు జాతీయ స్థాయి మ‌ద్ధ‌తు ఆయ‌న‌కు ఉండేది. త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి చెప్పిన‌ట్టు విష‌స‌ర్పం లాంటి బీజేపీని ఇంటిలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు ప్ర‌యాస‌ప‌డ్డారు. ఇప్పుడు కాటేసింది.

Also Read : TDP Loyalty : చంద్ర‌బాబు నిప్పంటూ కేశినేని స‌ర్టిఫికేట్

ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ఢిల్లీ రాజ‌కీయాల‌ను శాసించారు. దేశ వ్యాప్తంగా ఆయ‌నంటే గౌర‌వం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాలు అనుకూలంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ బ‌య‌ట చంద్ర‌బాబు ఇమేజ్ కు వ‌చ్చిన న‌ష్టం ఏమీలేదు. మంచోచెడో 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా మోడీని వ్య‌తిరేకించిన చంద్ర‌బాబు అదే త‌ర‌హాలో ఉండాల్సింది. సింహంలా ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌ను ఢీ కొడుతున్నారు అనే పేరు నిల‌బ‌డేది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌పై సింహంలా గ‌ర్జించే ఆయ‌న ఎప్పుడైతే త‌న నైజానికి భిన్నంగా త‌లొగ్గారో, అప్పుడే బీజేపీ, వైసీసీ, బీఆర్ఎస్ కు చుల‌క‌న అయ్యారు. అందుకే, సింహం ఎప్పుడు దానిలాగే బ‌త‌కాలి. లేదంటే ప్ర‌తి వాడు ఆడుకోవాల‌ని చూస్తాడ‌ని అంటారు పెద్ద‌లు.