GVMC Mayor Seat: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. అవిశ్వాసానికి మద్దతుగా 74 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెర పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ మరియు జిల్లాకలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీకి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఇక విశాఖపట్నం కొత్త మేయర్‌గా పీలా శ్రీనివాసరావును ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నుకునే అవకాశముందని తెలుస్తోంది.
విశాఖపట్నం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం వెలువడిన తర్వాత జీవీఎంసీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. వైఎస్సార్‌సీపీ మరియు కూటమి పార్టీలు తమ తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. కూటమి కార్పొరేటర్లు మలేషియా వెళ్లగా, వైఎస్సార్‌సీపీకి చెందిన వారు మొదట బెంగళూరుకు, అనంతరం శ్రీలంకకు వెళ్లారు.
అవిశ్వాస తీర్మానం శనివారం జరగనున్న నేపథ్యంలో, కూటమి కార్పొరేటర్లు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి వారిని కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా హోటల్‌కు తరలించారు. శనివారం ఉదయం 10 గంటలకు ఈ కార్పొరేటర్లు జీవీఎంసీకి వచ్చారు. ఇక శ్రీలంకలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ సమావేశానికి హాజరుకాలేదు. వారు ఒకటి రెండు రోజుల్లో విశాఖపట్నం తిరిగి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.
జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. పార్టీల బలాన్ని చూసుకుంటే — టీడీపీకి 48 మంది, వైఎస్సార్‌సీపీకి 30 మంది, జనసేనకు 14 మంది, బీజేపీకి 2 మంది, సీపీఐకి 1, సీపీఎంకు 1 సభ్యులు ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి కుమార్తె ప్రియాంక ఎవరికి మద్దతు ప్రకటించలేదు. కానీ ఆమె కూడా కూటమికి మద్దతు ఇచ్చినట్టు సమాచారం వినిపిస్తోంది. కూటమికి ఎక్స్-అఫీషియో సభ్యులు 11 మంది ఉండగా. వైఎస్సార్‌సీపీకి ముగ్గురు మాత్రమే మద్దతు ప్రకటించారు. 74 మంది సభకు హాజరైతే సరిపోతుంది. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత బెహరా భాస్కరరావు భార్య, కోడలు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి కూటమి వైపు వచ్చేయడంతో ఆ బలం మరింత పెరిగింది. మొత్తం మీద జీవీఎంసీ మీద కూటమి జెండా ఎగరవేసింది.