Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి (Thopudurthi Prakash Reddy) భారీ షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 75, 79, 351(2), 196, 352, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశామని రాప్తాడు పోలీసులు తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే సోదరుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో ఆఫీసులో చంద్రబాబు, లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే సోదరుడు చందు అమానవీయ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో మొద్దు శ్రీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెప్పి ఉంటే.. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని చంపేవాడ్ని తోపుదుర్తి చందు సంచలన వ్యాఖ్యలు చేశారు. చందు వ్యాఖ్యలపై ఆనాడే టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చందు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాప్తాడు పోలీసులకు సైతం ఆనాడు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఆ ఫిర్యాదులను ఏ మాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోపుదుర్తి చందుపై అనంతపురం ఎస్పీకి టీడీపీ బీసీ నేతలు ఫిర్యాదు చేయగా.. తాజాగా రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ జట్టులోకి మరో ముగ్గురు ఆటగాళ్లు?
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరు?
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 1950 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాప్తాడు నియోజకవర్గవైసీపీ ఇంఛార్జ్ గా నియమితుడయ్యాడు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత పై 25,575 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2021లో తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నికకు నియోజకవర్గం పరిధిలోని సూళ్ళూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశాడు.