RK Roja :ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకురాలు రోజా అసెంబ్లీ సీటుకు ఎసరు తెచ్చే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు.. గాలి భాను ప్రకాశ్, గాలి జగదీష్ ప్రకాశ్. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన రోజాను టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఓడించారు. ఆయన ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు 2018లో మరణించినప్పటి నుంచి గాలి భాను ప్రకాశ్, గాలి జగదీష్ ప్రకాశ్ సోదరుల మధ్య గ్యాప్ పెరిగింది. వాస్తవానికి 2019 సంవత్సరం నుంచే వీరిద్దరూ టీడీపీ తరఫున నగరి అసెంబ్లీ సీటు కోసం పోటీపడుతున్నారు.
Also Read :Gold From Electronics : ఎలక్ట్రానిక్ స్క్రాప్ నుంచీ గోల్డ్.. శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
2019లోనూ టీడీపీ టికెట్..
2019లోనూ టీడీపీ టికెట్ గాలి భాను ప్రకాశ్‌కే దక్కింది. అయితే అప్పట్లో ఆయన ఓడిపోయారు. 2024లోనూ గాలి భాను ప్రకాశ్‌కు టికెట్ ఇచ్చేందుకే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో గాలి జగదీష్ ప్రకాశ్ తీవ్ర నైరాశ్యంతో ఉన్నారు.తప్పకుండా నగరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలోనే ఈ నెల(ఫిబ్రవరి) 12న గాలి జగదీష్ ప్రకాశ్ వైఎస్సార్ సీపీలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే రోజా(RK Roja)కు మొండిచెయ్యే మిగులుతుంది.
Also Read :Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి..
నగరి ప్రాంతంపై పట్టు
గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు కుటుంబానికి నగరి ప్రాంతంపై మంచి పట్టు ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి జగన్ కచ్చితంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజాను పక్కన పెట్టి, నగరి ప్రాంతంపై రాజకీయంగా పట్టు కలిగిన గాలి జగదీష్ ప్రకాశ్‌కు అసెంబ్లీ టికెట్‌పై జగన్ హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే, వైఎస్సార్ సీపీలో రోజాను వ్యతిరేకించే చాలామంది నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇంఛార్జిగా రోజా కంటిన్యూ అవుతారని, పార్టీ బలోపేతం కోసం గాలి జగదీష్ ప్రకాశ్ లాంటి నేతలను తీసుకోక తప్పదనే అభిప్రాయం వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది.