NTR Trust Bhavan : నారా భువనేశ్వరి నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. బెజవాడలో 16వ జాతీయ రహదారి వెంబడి ఎల్‌ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా టెంపుల్ రోడ్డు జంక్షన్‌లో జీప్లస్5 విధానంలో అధునాతనంగా ఈ భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా విద్య, వైద్య సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేసే లక్ష్యంతో నిర్మాణం చేపడుతున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: London Tour : మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అలజడి..!
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కూడా సేవా కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భవనం పూర్తయితే ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. హైదరాబాద్ మెమోరియల్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కానున్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కూడా నియమాకాలు ఉంటాయి. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. జీప్లస్ 5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు.
కాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. నూతనంగా నిర్మించే ఈ ట్రస్ట్ భవనంలో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా ఇందులోనే ఏర్పాటుకానున్నాయి. తలసేమియా రోగులకు అవసమైన వైద్య సేవలను ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు. తలసేమియా కేర్ సెంటర్ నుంచే వైద్య సేవలు, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది.