Glass Symbol : ప‌వ‌న్ వ్యూహం వెనుక `గ్లాస్‌` గ‌ల్లంతు! పొత్తు లేక‌పోతే అంతే..!

ప‌వ‌న్ (Glass symbol) వ్యూహం ఏమిటి? ఓటు చీలిక లోగుట్టు ఏమిటి? బీజేపీ రోడ్ మ్యాప్ అయిందా?

  • Written By:
  • Updated On - December 20, 2022 / 04:47 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యూహం ఏమిటి? ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక లోగుట్టు ఏమిటి? బీజేపీ రోడ్ మ్యాప్ బుట్ట‌దాఖ‌లు అయిందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే వ‌చ్చే స‌మాధానం ఒక‌టే. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీని బ‌తికించుకోవాలి. ఆ దిశ‌గా చాలా కాలంగా ప‌వ‌న్ త‌ప‌న ప‌డుతున్నారు. గుర్తింపులేని `గ్లాస్`(Glass Symbol) పార్టీ ఈసారి ఎన్నిక‌ల‌తో గ‌ల్లంతు అవుతుంద‌న్న టెన్ష‌న్ స‌హ‌జంగా ఉంటుంది. అందుకే, టీడీపీతో పొత్తు(Alliance) పెట్టుకోవ‌డ‌మే ప‌వ‌న్ అంతిమ వ్యూహం అంటూ ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట‌. ఆ విష‌యాన్ని వైసీపీ లీడ‌ర్లు కూడా ప‌దేప‌దే చెబుతున్నారు.

`గ్లాస్`(Glass Symbol) గుర్తును

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కంటే జ‌న‌సేన‌కు పొత్తు(Alliance) అవ‌స‌రం. బీజేపీతో మాత్ర‌మే క‌లిసి వెళితే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ఫ‌లితం ఉంటుంద‌ని జ‌న‌సేన‌లోని మోజార్టీ అభిప్రాయం. 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా గుర్తింపుకు స‌రిప‌డా ఓట్లు రావని ఆ పార్టీకి ఉన్న బెంగ‌. అదే జ‌రిగితే, `గ్లాస్`(Glass Symbol) గుర్తును శాశ్వ‌తం మ‌రిచిపోవాల్సిందే. ఎందుకంటే, ఇప్ప‌టికే ఆ `గ్లాస్` గుర్తును బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రుల‌కు కేటాయించారు. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఆ గుర్తు ఇస్తార‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి న‌డుస్తున్నందున అవ‌కాశం ఉంటుంద‌ని కొంద‌రి అభిప్రాయం. వాస్త‌వంగా ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం `గ్లాస్`(Glass Symbol) గుర్తును జ‌న‌సేన‌కు ఇవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే, పార్టీ పెట్టిన త‌రువాత 2014, 2019 ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి గుర్తింపు వ‌చ్చేంత ఓట్ల శాతాన్ని రాబ‌ట్ట‌లేపోయింది.

జ‌న‌సేన‌కు పొత్తు(Alliance)

రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే క‌నీసం 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోవ‌చ్చ‌ని ఆ పార్టీ వ్యూహం. ఆ వ్యూహాన్ని త‌న‌కు వ‌దిలేయ‌మ‌ని ప‌వ‌న్ చెబుతూ వ్య‌తిరేక ఓటును చీలిపోకుండా చూడాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం బీజేపీతో జ‌న‌సేన క‌లిసి న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎనిమిదో ఆవిర్భావ పార్టీ స‌భ‌లో నాలుగు ఆప్ష‌న్ల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. మ‌రో నెల రోజుల త‌రువాత `అధికారం మ‌న‌దే` అంటూ కాబోయే సీఎంగా ఫోక‌స్ అయ్యారు. దీంతో టీడీపీ చాలా వ‌ర‌కు పొత్తుకు సైడ్ అయింది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన ప‌వ‌న్ తాజాగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక‌పోకుండా వ్యూహం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ప‌వ‌న్ కౌలు రైతులకు స‌హాయం అందించ‌డానికి వెళుతున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం అందిస్తున్నారు. అంత వ‌ర‌కు ప‌వ‌న్ ను అభినందించాల్సిందే. అయితే, చ‌నిపోయిన‌ కుటుంబ య‌జ‌మాని ఫోటోను మ‌హిళల చేతుల్లో ప్ర‌ద‌ర్శిస్తూ వేదిక క‌నిపిస్తోంది. ఆ వేదిక మీద నుంచి రైతుల సమ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు పొత్తుల గురించి లీకులు ఇస్తున్నారు.

చ‌నిపోయిన భ‌ర్త ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ

రాష్ట్రంలోని రైతు స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. చ‌నిపోయిన భ‌ర్త ఫోటోల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్న మ‌హిళల‌ మ‌ధ్య‌న ప‌వ‌న్ చేస్తోన్న పొలిటిక‌ల్ స్పీచ్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. గ‌త రెండేళ్లుగా టీడీపీతో పొత్తు అనే అంశం మీద జ‌న‌సేన పార్టీని ప్ర‌జాక్షేత్రంలో లైవ్ లో ఉంచుతున్నారు. ఇదే ప‌వ‌న్ పెద్ద వ్యూహం. హైద‌రాబాద్ నుంచి నెల‌కో , రెండు నెల‌ల‌కో ఒక‌సారి ఏపీకి విజిట్ చేసే ప‌వ‌న్ ను చూడ్డానికి జ‌నం వ‌స్తున్నారు. వాళ్ల‌ను చూసి రాజ్యాధికారం మ‌నదే అంటూ ఒక రోజు, వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌ని మ‌రో రోజు, ఆప్ష‌న్లు అంటూ ఇంకో రోజు ఇలా రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు.

ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ కు చెరో రెండేళ్లు సీఎం ప‌ద‌వి అనే ప్ర‌తిపాద‌న జ‌నసేన‌లోని కొంద‌రు మీడియా వ‌ర‌కు తీసుకొచ్చారు. వాళ్ల వాల‌కాన్ని గ‌మ‌నించిన టీడీపీ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తూ ప్ర‌జాక్షేత్నాన్ని న‌మ్ముకుంది. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు ఎక్క‌డ స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. ఆ జ‌న‌సందేహాన్ని గ‌మ‌నించిన జ‌న‌సేనాని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలకుండా చేయ‌డ‌మే ల‌క్ష్యం అంటూ చెబుతున్నారు. అంటే, టీడీపీకి ప‌డే ఓట్లు చీలిపోకుండా క‌లిసి పోదామ‌ని ప‌రోక్ష సంకేతం.

స‌ర్వేల సారాంశం

ఒక వేళ జ‌న‌సేన‌, బీజేపీ పోటీ చేస్తే ఏ విధంగా టీడీపీకి న‌ష్ట‌మో శాస్త్రీయంగా ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల నాటికి(2019) చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారు. ఆయ‌న ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ఉండే ఓట‌ర్లు 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు పోవాలి. కానీ, వైసీపీకి వెళ్ల‌డంతో 151 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. క‌మ్యూనిస్ట్ లు, బీస్పీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తే వ‌చ్చిన ఓట్లు సుమారు 5శాతం. ఆ ఓట్ల‌కు అద‌నంగా ఎంత ప‌డినా 7శాతానికి జ‌న‌సేన‌, బీజేపీ ఓటు బ్యాంకు పెర‌గ‌దని స‌ర్వేల సారాంశం. గ‌త ఎన్నిక‌ల కంటే ఇంకా త‌గ్గే అవ‌కాశం కూడా లేక‌పోలేదని కొన్ని స‌ర్వేల అంచ‌నా. అంటే, టీడీపీ అవ‌స‌రం జ‌న‌సేన‌కు ఉంది.

జ‌న‌సేన అవ‌స‌రం టీడీపీకి పెద్ద‌గా ఉండ‌దు. ఒకవేళ‌ పొత్తు ఉంటే కొంత లాభ‌మ‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్న‌ప్ప‌టికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయ‌ని విశ్లేషించే వాళ్లు లేక‌పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవ‌లం పార్టీ గుర్తింపు కోసం ప‌వ‌న్ వ్యూహాన్ని ర‌చించుకుంటున్నార‌ని అనుకోవ‌డం స‌హ‌జం. అంతే వ్యూహాత్మ‌కంగా టీడీపీ కూడా అడుగులు వేస్తోంది. ప‌వ‌న్ తో పెట్టుకుంటే మునుగుతామో, తేల‌తామో తెలియ‌ని సందిగ్ధ‌త క్షేత్ర‌స్థాయిలోని సామాజిక ఈక్వేష‌న్ క‌నిపిస్తోంది. సో, ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? అనేది చూడాలి.

Also Read : Janasena: జనసేనాని హ‌త్య కుట్ర తూచ్‌! తేల్చేసిన పోలీస్!!