Avuku ITI : అక్కడ విద్యార్థులు ఐటీఐ కోర్సు చదవాలంటే.. జైలులోకి వెళ్లాల్సిందే. ఔను.. మీరు విన్నది నిజమే. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా అవుకులో ఉంది. అక్కడి ఐటీఐ గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం..
Also Read :40000 Resignations : సంచలనం.. 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామాలు
గొంతెత్తని ప్రజాప్రతినిధులు
నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది. దీన్ని 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ ఈ కాలేజీని అవుకులో ఉన్న బ్రిటీష్ కాలపు సబ్ జైలు భవనంలో నిర్వహిస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ జైలుభవనం బాగా పాతబడి, శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా అందులోనే ఐటీఐ విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా..ఈ కాలేజీకి మాత్రం సొంత భవనం నిర్మాణం జరగడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఈ అంశంపై బలంగా గొంతెత్తిన దాఖలాలు లేవు. దీంతో దాదాపు 360 మంది విద్యార్థులు ఈ సబ్ జైలు భవనంలోనే ఐటీఐ తరగతులను వినాల్సి వస్తోంది. గత్యంతరం లేకపోవడంతో అరకొర వసతుల మధ్యే అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు.
Also Read :Trump Vs Panama : పనామా కాల్వపై నెగ్గిన ట్రంప్ పంతం.. అమెరికా నౌకలకు ఫ్రీ జర్నీ
స్మార్ట్ యుగం, టెక్ యుగం, ఏఐ యుగంలోనూ..
ఈ ఐటీఐ కాలేజీలోని ఒక్కో గది స్టోర్‌రూమ్‌లా అధ్వానంగా ఉంది. జైలు అవసరాల కోసం బ్రిటీష్ వాళ్లు నిర్మించిన ఈ భవనంలోని భారీ సైజు గదులను రేకులు, అట్టముక్కలతో వేర్వేరు తరగతి గదులుగా విభజించుకున్నారు. స్మార్ట్ యుగం, టెక్ యుగం, ఏఐ యుగంలోనూ ఇలాంటి స్థితిలో ప్రభుత్వ కాలేజీలు మగ్గుతుండటం బాధాకరం. అవుకు ఐటీఐ కాలేజీ భవన నిర్మాణం కోసం గతంలో అవుకు శివారులో ఉన్న కొండపై 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీంతోపాటు రూ.6 కోట్ల నిధులను సైతం మంజూరు చేశారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఆ ఫండ్స్ వెనక్కి వెళ్లిపోయాయి. కనీసం ఇప్పటి కూటమి ప్రభుత్వమైనా కాలేజీకి సొంత భవనాన్ని నిర్మిస్తుందని ఆశాభావంతో అవుకు ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులు ఎదురు చూస్తున్నారు.