Avinash Reddy : కడప జిల్లా పులివెందులలో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను కారులో అనుసరించారన్న ఆరోపణల నేపథ్యంలో, వైఎస్ ఆవినాశ్ రెడ్డి సన్నిహితులైన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం, అతడిని కారులో లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్ అనే ఇద్దరు అనుసరిస్తున్నట్టు ఆరోపించాడు. లోకేశ్ రెడ్డి – అవినాశ్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, పవన్ కుమార్ వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, పులివెందుల పోలీసులు భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్లు 351, 126 కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా, వీరిద్దరూ సోమవారం మధ్యాహ్నం లోగా విచారణకు హాజరవుతారని, స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ కొనసాగుతోందని, సునీల్ ఆరోపణలపై ఆధారాలు సేకరించే ప్రక్రియలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు.