మాజీ సీఎం , వైసీపీ పార్టీ (YCP) అధినేత జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురు పార్టీని వీడి టీడీపీ , జనసేన లలో చేరగా..ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నేతల దగ్గరి నుండి కింది స్థాయి నేతలు , కార్యకర్తల వరకు వరుస పెట్టి పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. ఇప్పటికి అలాగే బయటకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas) సైతం జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అయితే, ఇటీవల ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వైసీపీ శ్రేణులను షాక్ లో పడేసింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధిలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన అవంతి శ్రీనివాస్.. మంత్రిత్వ బాధ్యతలలో విశేష సేవలు అందించారు. కానీ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.తాజాగా తన రాజీనామా ప్రకటనలో అవంతి శ్రీనివాస్ వ్యక్తిగత కారణాలను ప్రస్తావించారు. ప్రస్తుతం రాజకీయాలకు తాత్కాలికంగా విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాలకు తిరిగి వస్తారా లేదా అన్న ప్రశ్నలపై స్పష్టత ఇవ్వలేదు. అవంతి శ్రీనివాస్ రాజీనామా తరువాత ఆ నియోజకవర్గ వైసీపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది. వైసీపీ పరాజయం తరువాత నాయకత్వానికి ఎదురవుతున్న సవాళ్లలో ఇది ఒకటిగా మారింది.
2009లో ప్రజారాజ్యం నుంచి అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి, మెగా బ్రదర్స్ కు దగ్గరయ్యారు. విశాఖ సీనియర్ నేత గంటా తో తొలి నుంచి సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత గంటాతో కలిసి అవంతి టీడీపీలో చేరారు. 2014 ల నాటి రాజకీయ సమీకరణాల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన అవంతి టీడీపీ నుంచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఆ తరువాత గంటాతో విభేదాలు వచ్చాయి. దీంతో, టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాడు దక్కిన హామీ మేరకు భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరువాత జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ చేతిలో భీమిలిలో అవంతి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ పైన అవంతి గతంలో చేసిన విమర్శలు, పవన్ సైతం అవంతి పైన చేసిన కామెంట్స్ తో జనసేనలో ఛాన్స్ లేదని..ఒకవేళ వస్తానన్న ఆయన్ను చేర్చుకోవద్దని జనసేన శ్రేణులు అంటున్నారు. చూద్దాం అవంతి దారి ఎటు వైపు వెళ్తుందో..!!
Read Also : Manish Pandey: స్టార్ క్రికెటర్ మనీష్ పాండేకు బిగ్ షాక్