Janasena: జనసేనాని హ‌త్య కుట్ర తూచ్‌! తేల్చేసిన పోలీస్!!

`అదిగో పులి అంటే ఇదిగో తోక..` చందంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద హ‌త్య‌కు కుట్ర అంశం మారింది.

  • Written By:
  • Updated On - November 5, 2022 / 01:31 PM IST

`అదిగో పులి అంటే ఇదిగో తోక..` చందంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద హ‌త్య‌కు కుట్ర అంశం మారింది. బాధ్య‌త‌లేని కొన్ని మీడియా సంస్థ‌లు ఆయ‌న హ‌త్య‌కు కుట్ర చేశార‌ని, రూ. 250 కోట్ల సుఫారీ కుదుర్చుకున్నార‌ని గ‌త నాలుగు రోజులుగా హోరెత్తించింది. గుజ‌రాత్ కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు రెక్కీ నిర్వ‌హించార‌ని అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసింది. సీన్ క‌ట్ చేస్తే, అంతా అవాస్త‌మ‌ని జూబ్లీహిల్స్ పోలీసులు తేల్చ‌డం గ‌మ‌నార్హం.

అర్థ‌రాత్రి అక్టోబ‌ర్ 31వ తేదీన హైద‌రాబాద్ లోని ప‌వ‌న్ ఇంటి వ‌ద్ద ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రెక్కీ నిర్వ‌హించార‌ని జ‌న‌సేన అనుమానం. వ‌రుసగా మూడు రోజుల పాటు అనుమానితులు ఆయ‌న ఇంటి చుట్టూ త‌చ్చాడార‌ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేర‌కు జ‌న‌సేన సీనియ‌ర్ లీడ‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అధికారికంగా వెల్ల‌డించారు. దీంతో జ‌న‌సేన సొంత మీడియా టీడీపీ సానుకూల మీడియా ఇష్టానుసారంగా ప‌వ‌న్ హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని ఎపిసోడ్ ల‌ను అల్లేశారు. జ‌న‌సైనికులు కొన్ని చోట్ల భావోద్వేగాల‌కు గుర‌య్యేలా ఎపిసోడ్ల ను పండించారు.

Also Read:  Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!

విచిత్రంగా మాజీ కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మీడియా ముందుకొచ్చి ఏకంగా చంద్ర‌బాబునాయుడే జ‌న‌సేనాని ప‌వ‌న్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నాడ‌ని నోరుపారేసుకున్నారు. ఆయ‌న మీద హ‌త్య‌కు కుట్ర చేసిందెవ‌రో తేల్చాల‌ని చంద్ర‌బాబు కూడా డిమాండ్ చేశారు. వీట‌న్నింటినీ క్రోడీక‌రించి మొత్తం హ‌త్య‌కు కుట్ర వ్య‌వ‌హారాన్ని వైసీపీకి చుట్టాల‌ని కొంద‌రు టీడీపీ సానుభూతి జ‌ర్న‌లిస్ట్ లు విశ్లేష‌ణ‌లు ఇచ్చారు. ఫ‌లితంగా గ‌త వారం ఏపీ వ్యాప్తంగా ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. కులాల మ‌ధ్య చిచ్చుకు దీన్నో అస్త్రంగా రాజ‌కీయ పార్టీలు మార్చేసుకోవ‌డం శోచ‌నీయం.

పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని, పవన్ పై దాడికి కూడా కుట్ర కూడా జరగలేదని శుక్ర‌వారం రాత్రి తెలంగాణ పోలీసుశాఖ వెల్లడించింది. ఆ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇచ్చిన నివేదికను తెలంగాణ పోలీస్ విడుదల చేసింది. ఆ నివేదిక ప్ర‌కారం అక్టోబ‌ర్ 31వ తేదీ రాత్రి ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద బౌన్సర్లతో గొడవకు దిగారు. ఆ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని అనుమాన‌ప‌డ్డారు. అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. జ‌న‌సేనాని సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.

Also Read:  Amaravati: `అమ‌రావ‌తి` సుప్రీం విచార‌ణ వాయిదా

విచారణలో భాగంగా మద్యం మత్తులోనే పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఆ ముగ్గురు యువ‌కులు కారు ఆపారు. కారును తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగింది. దీంతో ఆ యువకులు, బౌన్స‌ర్ల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింద‌ని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్ల‌డించారు. ఆ యువకులకు నోటీసులు జారీ చేసి, పంపించివేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రెక్కీ గానీ, పవన్ పై హ‌త్య‌కు కుట్ర గానీ జరగలేదని పోలీసులు ధ్రువీక‌రించారు. ఇప్పుడు నాలుగు రోజులుగా గాలిని పోగుచేసి ఎపిసోడ్ ల‌ను, క‌థ‌ల‌ను క‌థ‌నాలుగా మ‌లిచిన కొంద‌రు ఉద్ధండ జ‌ర్న‌లిస్ట్ లు ఏమి చెబుతారు? సమాజంపై బాధ్య‌తార‌హిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఇప్ప‌టికైనా వాళ్లు మానుకోవాలి. లేదంటే అదిగో పులి సామెత‌లాగా, భ‌విష్య‌త్ లో నిజాల‌ను కూడా స‌మాజం న‌మ్మ‌కుండా పోయే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించాలి