Site icon HashtagU Telugu

Atchannaidu : జగన్ వైఫల్యాల వ‌ల్లే భారీ పంట న‌ష్టం – అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు అన్నారు. కుప్పం ఎన్నికల్లో బోగస్ ఓటర్లను ప్రయోగించేందుకు జగన్‌ రెడ్డి ప్ర‌భుత్వం ఆసక్తి కనబరిచింది కానీ… భారీ వర్షాలకు నష్టనివారణ చర్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి సారించలేదని… సీఎం జగన్ చౌకబారు రాజకీయాలు మానేసి ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు. వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని.. ఒక్క కడప జిల్లాలోనే 12 మందికి పైగా మరణించగా, మరో 30 మంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.

Also Read : జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చినజీయర్‌ స్వామి

రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు కొంత మంది సర్వం కోల్పోయారని అచ్చెన్నాయుడు తెలిపారు. నిరాశ్రయులయ్యి రోడ్లపైనే ఉండిపోయారని… వారిని రక్షించే బదులు వైఎస్సార్‌సీపీ నేతలు బురదజల్లే రాజకీయాలకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు. కుప్పంలో పోలింగ్ రోజున బోగస్ ఓటర్లను పక్క రాష్ట్రాల నుంచి బస్సుల్లో తీసుకొచ్చారు. వరద బాధితుల సహాయార్థం ఇతర జిల్లాల నుంచి ఎవరూ ఎందుకు బస్సుల్లో రావడం లేదు అని ప్ర‌శ్నించారు.

Also Read : నందమూరి “సింహ” గర్జన

వరద ముప్పు గురించి ముందస్తు సమాచారం ఉందని…అయితే సకాలంలో స్పందించడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లనే అపారమైన పంటలు, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ దుర్ఘటనపై జగన్ పాలన ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాల‌న్నారు. చెమట, రక్తంతో సాగుచేసిన పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రభుత్వం వెంటనే పంట నష్టాల లెక్కింపు చేపట్టాలని… వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ వంతుగా అన్ని విధాలా కృషి చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.