తెలుగుదేశం పార్టీ అధినేత., సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతున్నారు. ఐదు స్థానాల్లో ఒకటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలు పూర్తిగా టీడీపీ ఖాతాలోనే ఉండనున్నాయి. బీజేపీకి ఈసారి ఎమ్మెల్సీ అవకాశాలు లభించే సూచనలు లేవు. రాబోయే రాజ్యసభ ఉపఎన్నికల్లో ఆ పార్టీ తరపునే ఒక అభ్యర్థి పోటీ చేయనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఆ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో బీజేపీకి ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు.
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
ఈ నాలుగు స్థానాల్లో అవకాశం కోసం చాలా మంది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కూటమి పొత్తుల కారణంగా టిక్కెట్లు వదులుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలకు మళ్లీ అవకాశం ఇవ్వాలా లేదా కొత్త వారిని ఎంపిక చేయాలా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడికి మళ్లీ అవకాశం దక్కుతుందా లేదా అనే ప్రశ్న టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ఆయనకు అవకాశం రాకపోవచ్చన్న అనుమానంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉండటంతో, ఈసారి ఎమ్మెల్సీ పదవి ఆయనకు దక్కకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక మరో కీలక నేత పడుచూరి అశోక్ బాబుకు పదవి పొడిగింపు సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. జనసేన తరపున నాగబాబును ఎంపిక చేయడంతో మరో కాపు నేతకు అవకాశం దక్కడం కష్టసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే ఈసారి రిటైర్ అవుతున్న నేతలెవరికి అవకాశం దక్కదనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్లు సమాచారం. దీంతో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. ముఖ్యంగా, పోటీ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ టిక్కెట్లు వదులుకున్న దేవినేని ఉమా, పిఠాపురం వర్మ వంటి నేతలు ఎమ్మెల్సీ అవకాశాలను ఆశిస్తున్నారు. చంద్రబాబు ఈ ఇద్దరికీ ప్రాధాన్యత ఇస్తారా లేక మరికొందరిని ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
PV Sunil Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌పై కేసు ?
రాబోయే ఐదేళ్లలో వైసీపీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానాలు లభించే అవకాశం లేనందున, అందరూ కూటమి పార్టీలకే చెందనున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ నాయకత్వం అందరికీ అవకాశాలు ఇవ్వడానికి వ్యూహాన్ని రూపొందిస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తులో వచ్చే రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికను చేపడుతోంది. మున్ముందు మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో, ఎవరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారవుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.