ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల (AP New Ration Card 🙂 కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ, కొత్తగా పెళ్లైన దంపతుల కోసం కీలక నిబంధనను ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ (వివాహ ధ్రువీకరణ పత్రం) జత చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ నిబంధనతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలంటే శుభలేఖ, ఆధార్, వయస్సు ధృవీకరణ పత్రాలు, వివాహ ఫొటోలు, ముగ్గురు సాక్షులు, కల్యాణ మండపం రశీదు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
MP Raghunandan Rao : మంత్రి పొంగులేటి పై బీజేపీ ఎంపీ ప్రశంసలు
పెళ్లి ఆలయంలో జరిగితే ఆలయం ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు రూ.500 చలానా జత చేసి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు సరైనవిగా ఉంటే గంట వ్యవధిలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ మంజూరు అవుతుంది. అయితే రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దళారుల దందాలు కొనసాగుతున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల దళారులు ₹3,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. ముస్లిం, క్రైస్తవ వర్గాలకు సంబంధించిన దంపతులకు మ్యారేజ్ సర్టిఫికేట్ రావడానికి కనీసం రెండు నెలలు పడుతోందని, వీరి దరఖాస్తు వివరాలు ఒక నెల పాటు నోటీసు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుందన్న కారణంగా ఆలస్యం జరుగుతోంది.
ఇక ఈ నేపథ్యంలో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనున్నదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. శుభలేఖ, ఫొటో వంటి ఆధారాలతోనే అప్లికేషన్ పరిగణనలోకి తీసుకునేలా సడలింపులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తు గడువు జూన్ 7 వరకు మాత్రమే ఉన్నందున, దంపతులు ముందస్తుగా మ్యారేజ్ సర్టిఫికేట్ సిద్దం చేసుకోవడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.