Electric Buses : వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. 2029 నాటికి ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సుల స్థానాన్ని పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది. 2029 సంవత్సరంకల్లా ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దె బస్సులు 2,562 కలుపుకొని మొత్తం 12,717 బస్సులు ఎలక్ట్రిక్‌వే ఉండేలా ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర సగటున రూ.1.80 కోట్ల దాకా ఉంటుంది. ఇంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి భారమే అవుతుందని అంటున్నారు. ఏపీలోని 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతిలకు 50 చొప్పున మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.35 లక్షల దాకా ఆయా కంపెనీలకు సబ్సిడీ ఇస్తోంది.
Also Read :Formula E Car Race : రేపోమాపో కేటీఆర్‌పై కేసు.. గవర్నర్ అనుమతి వివరాలు ఏసీబీకి !
- 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు (స్క్రాప్)గా పరిగణిస్తారు. ఈ రూల్ ప్రకారం రాబోయే ఐదేళ్లలో 2,537 ఆర్టీసీ బస్సులు తుక్కుగా మారుతాయి. వాటి స్థానంలో విద్యుత్ బస్సులను కొంటారు.
- ఇతరత్రా కేటగిరీలకు చెందిన మరో 5,731 బస్సులను కూడా వచ్చే ఐదేళ్లలో పక్కన పెట్టి.. కొత్తవి కొంటారు. ఇలా పక్కన పెట్టనున్న బస్సుల జాబితాలో… 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సులు, 10 లక్షల కి.మీ. తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులు, అల్ట్రా డీలక్స్ బస్సులు, 8 లక్షల కి.మీ. నడిచిన ఎక్స్‌ప్రెస్ బస్సులు, 6.5 లక్షల కి.మీ నడిచిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు, 8 లక్షల కి.మీ నడిచిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు, 12 లక్షల కి.మీ దాటిన పల్లెవెలుగు బస్సులు, 13 లక్షల కి.మీ తిరిగిన సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి.
- 2029లో కొత్తగా తీసుకోబోయే 1,285 అద్దె బస్సులు, 2025-29 వరకు కొత్తగా పెంచబోయే 1,698 బస్సులు, 2029లో అదనంగా చేర్చబోయే 2,726 బస్సులు కూడాఎలక్ట్రిక్‌వే ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.