APL 2025 : విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్ ఘనంగా జరిగింది. ఫైనల్‌లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ అందించారు. తొలి చూపులో అమరావతి రాయల్స్ విజేతగా కనిపించినా, చివరికి ఫైనల్ విజయం తుంగభద్ర వారియర్స్ జట్టుకు దక్కింది. టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అమరావతి రాయల్స్ అద్భుత ఆరంభం చేసింది. కెప్టెన్ హనుమ విహారి, మాన్యాల ప్రణీత్ జోడీ మొదటి 6 ఓవర్లలోనే 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో జట్టు వేగంగా స్కోర్‌ను పెంచింది. విహారి 37 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి, జట్టు ఇన్నింగ్స్ లో కీలక పాత్ర పోషించాడు. ప్రణీత్ 22 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 47 పరుగులు చేసి విహారి సహకారం అందించాడు. పాండురంగ రాజు 22 పరుగులు చేయగా, మరికొంతమంది ఆటగాళ్లు అడపాదడపా స్కోరు చేసి జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు నమోదు చేసింది.
Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు
తుంగభద్ర బౌలర్లలో కె.వి. శశికాంత్ 3 వికెట్లు తీసి, సి. స్టీఫెన్ 2, చెన్ను సిద్ధార్థ 1 వికెట్ తీసి అమరావతి రాయల్స్ స్కోర్‌ను పరిమితం చేయడానికి ప్రయత్నించారు. 195 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి దిగిన తుంగభద్ర వారియర్స్ ప్రారంభంలో కొంత తడబడినప్పటికీ, మధ్యలో యువ ఆటగాళ్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం సాధించారు. సి.ఆర్. జ్ఞానేశ్వర్ 45 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్ళాడు. గుట్టా రోహిత్ 28 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో ఘన ఇన్నింగ్స్ ఆడి అమరావతి రాయల్స్ విజయానికి దూరం చేశాడు. ఎం. దత్తా రెడ్డి 12 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టుకు మద్దతు ఇచ్చాడు. మ్యాచ్ చివరలో కె.వి. శశికాంత్ (7*) హనుమ విహారి వేసిన ఓవర్ చివరి బంతిని సిక్స్‌గా కొట్టి, జట్టుకు 12 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం అందించారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి, యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆసక్తిపెంచింది.