Site icon HashtagU Telugu

AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు

AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

AP :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పటిష్టంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..”స్వర్ణాంధ్ర 2047″ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగనుంది. రోడ్లు, రైలు, సముద్ర మార్గాలు, ఎయిర్ లింకులు వంటి అన్ని మాధ్యమాల్లో లాజిస్టిక్స్ విస్తరణకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశాం అని తెలిపారు.

Read Also: Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

అంతేకాకుండా, నదుల అనుసంధానాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇది నీటి భద్రతతో పాటు రవాణా అవసరాలకు కీలకమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. గ్రీన్ హైడ్రోజన్ వనరులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. డ్రోన్లు, ఐవోటీ, సెన్సార్స్ వంటివి అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఇవన్నీ లాజిస్టిక్స్ రంగాన్ని కూడా మరింత సమర్థవంతంగా మారుస్తాయన్నారు. రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఒక విలువైన ఆస్తిగా వర్ణించారు. ప్రస్తుతం రాష్ట్రం ద్వారా దేశంలోని 90 శాతం బల్క్ కార్గో రవాణా జరుగుతోందని, భవిష్యత్తులో ఎయిర్ కార్గోద్వారా వేగవంతమైన సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహం ఇచ్చే ప్రణాళిక ఉందన్నారు. రైలు కనెక్టివిటీ విషయంలో ఏపీకి అనేక అవకాశాలున్నాయి. తూర్పు తీరంలో లాజిస్టిక్స్ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలవాలి, అని అన్నారు.

ప్రస్తుతం ఆరు ప్రధాన పోర్టులు ఉన్నాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలియజేశారు. 2046 నాటికి అన్ని పోర్టుల నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చూస్తున్నాం. ఇది రాష్ట్రానికి వాణిజ్యపరంగా దోహదపడుతుంది అని పేర్కొన్నారు. ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం ఇప్పటికే అగ్రగామిగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల పరంగా కూడా అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నామని వివరించారు. రాష్ట్రానికి సహజసిద్ధమైన వనరులు లభ్యమవడం వల్ల పోర్టుల అభివృద్ధికి అవి ప్రధాన బలం అవుతాయని చెప్పారు. ఈ సమ్మిట్‌లో ఎయిర్ కార్గో ఫోరమ్ ఇండియా యొక్క అధికారిక లోగోను సీఎం ఆవిష్కరించారు. అనంతరం పలువురు లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు ఎయిర్ కార్గో వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. సదస్సులో దాదాపు 20 ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొనడం విశేషం. ‘‘వన్ ఫ్యామిలీ.. వన్ ఆంట్రప్రెన్యూర్’’ అనే భావనను ప్రోత్సహించాలన్నది తన లక్ష్యమని సీఎం స్పష్టంచేశారు. దేశంలో షిప్ బిల్డింగ్ రంగం వెనుకబడి ఉందని, దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేశారు.

Read Also: Telangana : కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందన