TDP : ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన టీడీపీ నేత‌లు.. త‌ప్పుడు కేసుల వివ‌రాల్ని గ‌వ‌ర్న‌ర్‌కి అంద‌జేత‌

టీడీపీ నేత‌లు ఏపీ గవ‌ర్న‌ర్‌ని క‌లిశారు.చంద్రబాబు అరెస్ట్ వెనకున్న రాజకీయ కుట్రల్ని, ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన

  • Written By:
  • Updated On - October 18, 2023 / 09:07 PM IST

టీడీపీ నేత‌లు ఏపీ గవ‌ర్న‌ర్‌ని క‌లిశారు.చంద్రబాబు అరెస్ట్ వెనకున్న రాజకీయ కుట్రల్ని, ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ ని కోరిన‌ట్లు టీడీపీ నేత‌లు తెలిపారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై అయితే తప్పుడు కేసులు పెట్టిందో, వాటన్నింటికి సంబంధించిన పూర్తి వాస్తవాలను టీడీపీ గవర్నర్ ముందు ఉంచింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ పై ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు.. వాటిని తిప్పికొడుతూ టీడీపీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిన వాస్తవాలను గవర్నర్ కు అందించామ‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ హెడ్ అరాచకాలు, రూల్ ఆఫ్ లాను కాపాడాలని, కాన్ స్టిట్యూషనల్ హెడ్ అయిన గవర్నర్ ని కోరామ‌ని మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరవర్గాలపై ప్రభుత్వం చేస్తున్న దాడులను గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ వ్యవస్థను అడ్టుపెట్టుకొని సాగిస్తున్న దుర్మార్గాలను, రాజ్యాంగవ్యవస్థల్ని వ్యక్తి గత ప్రయోజనాలకోసం వినియోగిస్తున్న వైనాన్ని, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై పెట్టిన తప్పుడు కేసులు…ఆయన్ని అన్యాయంగా జైలుకు పంపిన విధానాన్ని వాస్తవాలతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పైసా అవినీతి కూడా జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఆరోపణలు చేసిందన్నారు. ఆ తరువాత రూ.340కోట్లని విషప్రచారం చేశారని.. చివరకు రూ.27కోట్లనే స్థితికి దిగజారార‌న్నారు. కథ ముగింపుకు వచ్చేసరికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్రప్రభుత్వానికి రూ.8.50 కోట్ల జీఎస్టీ చెల్లింపులు సరిగా చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్టు జగన్ ప్రభుత్వం వాదిస్తోందని టీడీపీ నేత‌లు ఆరోపించారు. చంద్ర బాబునాయుడిపై వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింద ని తొలుత తప్పుడు కేసుపెట్టి అరెస్ట్ చేసిందని.. తరువాత ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని, ఇన్నర్ రింగ్ రోడ్ లో తప్పుజరిగిందని కేసులు పెట్టిందన్నారు. ఈ మూడు అంశాలకు సంబంధించిన వాస్తవాల్ని ఇప్పటికే టీడీపీ ప్రజలముందు ఉంచిందని.. ప్రజల ముందు ఉంచిన వాస్తవాలనే నేడు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామ‌ని తెలిపారు. తాము అందించిన సమాచారం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఒక సవివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని గవర్నర్ గారిని కోరామన్నారు. తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు.. వాటిపై కోర్టుల్లో జరుగుతున్న విచారణ అంతా తనకు తెలుసునని గవర్నర్ గారు తమతో చెప్పారని తెలిపారు.

Also Read:  BJP : తెలంగాణలో బిజెపి మాస్టర్ స్కెచ్.. పవన్ కళ్యాణ్ సమేతంగా..