Site icon HashtagU Telugu

AP Spurios Liquor Probe: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టాస్క్‌ఫోర్స్‌!

Ap Spurios Liquor Probe

Ap Spurios Liquor Probe

AP Spurios Liquor Probe: జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన జీవితాలను ఛిద్రం చేసి మరణ మృదంగం మోగించింది మందు బాబుల గొంతుల్లో కాలకూట విషం పోసి వేలాది కుటుంబాల్లో శోకాగ్నులు రగిలించిన మద్యం మారీచుడు జగన్ రెడ్డే . గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం లో నాటు సారా పాలబడి ఎందరో అభాగ్యులు ప్రాణాలు గాలిలో కలిసి పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ మరణాలుగా బుకాయించి చేతులు దులుపు కొన్నది. కల్తీ మద్యం బారిన పడిన వారి దీన రోదనలు చూసిన వారి గుండెలు ద్రవించాయి.

కల్తీ మద్యమే ప్రాణాలు బలిగొన్నదని కఠోర వాస్తవాలు బయట పడినా జగన్ రెడ్డి దీర్ఘకాలిక వ్యాధులు వల్ల సహజ మరణాలు అంటూ తన దైన శైలిలో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలతో ఎదురు దాడి చేశారు.మూడేళ్లనాడు జరిగిన కల్తీ సారా మరణాలపై సమగ్ర దర్యాప్తు కు కూటమి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో మందుబాబులు తక్కువ ధరకు వచ్చే నాటుసారా తాగేవారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది విచ్చలవిడిగా నాటుసారా కాసి అమ్మకాలు సాగించారు. కిక్‌ కోసం అనేక రకాల పదార్థాలను కలిపి సారా తయారు చేసేవారు. కల్తీసారా తాగి వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 30 మంది వరకు మృతి చెందడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి.

కల్తీ సారా మరణాలు కాదంటూ ప్రభుత్వం ఎదురు దాడి చేసింది.మరణించిన వారిలో నలుగురు మాత్రమే 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు. మిగిలిన వారంతా 40 నుంచి 50 ఏళ్లు మధ్య ఉన్నవారే. వారిలో ఎవరికీ ఎటువంటి అనారోగ్య సమస్యలూ కూడా లేవని, సారా తాగిన తర్వాతనే నీరసం, విరోచనాలు వంటివి సంభవించి మరణించారని మృతుల కుటుంబసభ్యులు భోరున విలపించారు. కుమారులు చనిపోయిన తల్లితండ్రులు, భర్తను కోల్పోయిన మహిళలు రోడ్డెక్కి భోరున విలపించారు. కల్తీసారా మరణాల పై శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ సభ్యులు నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని గట్టిగా డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపిన టీడీపీ సభ్యులను మండలి నుంచి సస్పెండ్‌ చేశారు.

జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారీయే లేదని అసెంబ్లీలో జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రమంతా నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మార్చి 14న జంగారెడ్డిగూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించి టిడిపి తరపున కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారంతా అనారోగ్యంతో చనిపోయారంటూ బుకాయించింది. మృతుల కుటుంబాలకు చిల్లిగవ్వ పరిహారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జంగారెడ్డిగూడెం లో కల్తీసారా మరణాలపై నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం.సిద్ధమై ముగ్గురు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.మరణాలపై లోతుగా అధ్యయనం చేసి బాధ్యులెవరో గుర్తించాలని, సాంకేతిక పరమైన సిఫార్సులు కూడా చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కల్తీ మద్యం తాగి మరణించారని బాధిత కుటుంబాలు బోరున విలపించాయి.బండబారిన రాతి గుండె ప్రభుత్వానికేంతెలుసు నకిలీ మద్యం బారినపడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆవేదన. నాటుసారాకి కొడిగడుతున్న బ్రతుకుల విలువ ప్రభుత్వానికేం తెలుసు. అనారోగ్య సమస్యలతో చనిపోయారని చెప్పాలంటూ వారిపై పోలీసులతో ఒత్తిడి చేయించింది జగన్ ప్రభుత్వం. జగన్,ప్రభుత్వ యంత్రాంగం అంతా సహజ మరణాలే అని వాదించినప్పటికీ ఫోరెన్సి క్ నివేదికలో మాత్రం సహజ మరణాలు కావని వెల్లడయింది. మృతుల శరీరంలో మిథైల్ ఆల్కహాల్,ఇథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. రసాయన పరిశ్రమల్లో వినియోగించే మిథైల్ ఆల్కహాల్ కలిపిన మద్యాన్ని తాగడం వల్ల విషపూరితం అయి మృతి చెందారు.

సామాన్యుల ప్రాణాలు తీస్తున్న నాటుసారాను నిర్ములిస్తామని,ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని, దీని పై న్యాయ విచారణ జరిపిస్తామని, నకిలీ మద్యం వ్యాపారులను శిక్షిస్తామని,చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పకుండా అవి సహజమరణాలు, ఏ ప్రభుత్వం వున్నా జరిగేవే అంటూ అడ్డంగా బుకాయించి నాటుసారా వ్యాపారాన్ని సమర్ధించే విధంగా స్వయంగా జగన్ రెడ్డే మరణాల తీవ్రతను తేలికగా లెక్కలేని తనంగా మాట్లాడారు. 55వేల మంది జనాభా నివసించే ప్రాంతంలో నాటు సారా తయారు చేయడం సాధ్యమవుతుందా అని అసెంబ్లీలో జగన్‌ రెడ్డి ప్రశ్నించారు. మరి ఆయన ప్రకటనే నిజమైతే గడిచిన నాలుగైదు రోజుల్లో జంగారెడ్డి గూడెం, పరిసర ప్రాంతాల్లో 25 మందిపై కల్తీ సారా కేసులు ఎలా పెట్టారు? వీరిలో నలుగురిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో [సెబ్‌] అరెస్ట్‌ కూడా చేసింది. మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు ఇవి సహజ మరణాలే అని ఎదురుదాడి చేసారు . ప్రభుత్వం చెబుతున్నట్లు అవి సహజ మరణాలే అన్న వాదనను నమ్మడానికి ఆధారాలు లేవు. పూర్తీ ఆధారాలు వెలుగులోకి తేవడానికి పూర్తిస్థాయి విచారణ జరిపించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆ దిశ గా చర్యలు తీసుకోకుండా అధికారంలో ఉన్నామని అడ్డగోలు వాదనకు దిదిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటివరకు కల్తీ మద్యం తాగి 43 మంది,శానిటేజర్ తాగి 63 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అభాగ్యులు. ఇంకా ఎంత మంది నాటుసారా తాగి ప్రాణాలు తీసుకొవాలి? నకిలీ మద్యం,నాటు సారా నిర్ములించే బాధ్యత తీసుకోకుండా ? సహజ మరణాలు అంటూ ముఖ్యమంత్రి,మంత్రులు అసలు దోషులను రక్షించే విధంగా వ్యవహరించారు.

జగన్ హయాంలో జంగారెడ్డిగూడెంతో పాటు పరిసర ప్రాంతాలతో పాటు,మిగిలిన కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు కుటీర పరిశ్రమగా సాగింది.అంతేకాదు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బ్యూరో [సెబ్] అధికారులు నాలుగైదు రోజులు పాటు నాటు సారా తయారీ కేంద్రాల పై జరిపిన దాడుల్లో ధ్వంసం చేసిన బెల్లం ఊట,స్వాధీనం చేసుకొన్న నాటు సారా లీటర్ల వివరాలు చూస్తే క్షేత్రస్థాయిలో నాటు సారా తయారీ దందా ఎంత విచ్చలవిడిగా సాగిందో అర్ధం అవుతుంది. అధికార పార్టీ అండదండలతోనే కొందరు మారుమూల ప్రాంతాల్లో పెద్దఎత్తున నాటు సారా తయారు చేయించి దానికి పట్టణాలకు,పల్లెలకు సరఫరా చేసేవారు. అక్రమ నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ వున్నాయి,ఎక్కడనుండి ఎక్కడికి సరఫరా అవుతుంది,దీని వెనక ఎవరెవరు వున్నారు అనే అంశాలు పోలీస్,స్పెషల్ బ్యూరో అధికారులకు తెలిసినా వాటాలకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరించిడం వల్లనే కల్తీ మద్యానికి సామాన్యులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కల్తీ మద్యం తయారు చేసే స్థావరాలు ఎవరు ఎక్కడ నెలకొల్పారో స్థానిక వైసిపి నాయకులకు,అధికార యంత్రాoగానికి,పోలీసులకు తెలిసినా వాటాలు,చెల్లింపుల మాటున రాజకీయ రక్షణ కవచం కాపాడింది. ఖరీదు అయిన బాటిల్స్ లో కల్తీ మద్యం ఫోన్ చేస్తే ఇళ్లకే సరఫరా చేసే పద్దతి కొనసాగినట్లు సమాచారం. అధికారులు నామమాత్రపు సోదాలతో సరిపెట్టబట్టే గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా పొంగి ప్రవహించింది. జగన్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిన దగ్గరనుండి రాష్ట్రంలో నకిలీ సారాజ్యం విస్తరించింది.పెరిగిన ధరలతో మద్యం కొనలేక శ్రమజీవులు రోజుకూలి చేసుకొనే నిరుపేదలు నాటుసారాకి అలవాటు పడ్డారు.పెరిగిన రేట్లతో మద్యం అలవాటు మానుకోలేక, అధిక ధరలకు మద్యం కొనలేక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 మందికి పైగా శానిటైజర్ కూడా త్రాగి చనిపోయిన ఉదంతాలు చూసాం. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినా సామాన్యులు అందుబాటులో వున్న నాటుసారానే తాగుతున్నారు.శాంతి యుతంగా ప్రజల పక్షాన నిరసన ప్రదర్శనలు చేసే వారి పైకి,రాజకీయ ప్రత్యర్థుల పైకి పోలీసులను ఉసి గొలిపిన జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే కల్తీ మద్యం తయారీ దారులు పై మాత్రం ప్రేమాభిమానాలు చూపించింది.

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దశల వారీ మధ్య నిషేధం,నియంత్రణ హామీలు అన్నికొల్లబోయి నకిలీ మద్యంతో విషాద ఘటనలు ఎన్నో నమోదుఅయ్యాయి. మద్యం ఆదాయమే జగన్ ప్రభుత్వానికి దిక్కు అయింది. ఆదాయం కొరకు పేదల రక్తాన్ని కాసులుగా పిండుకొంటూ బూటకపు సంక్షేమంతో బురిడీ కొట్టిస్తు బడుగు జీవుల బలహీనతను సొమ్ము చేసుకొన్నారు. 2019 ఎన్నికలు ముందు మద్యాన్ని ఎరులై పారిస్తున్నారని గుండెలు బాదుకొన్న జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ నాలుక నాలుగు వంకర్లు తిరిగింది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కల్తీ మద్యం అమ్ముతూ మందు బాబుల ఆస్తులు,ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్లు అమ్మడమే కాక, మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయం పెంచుకున్నారు. జగన్ ధనదాహానికి పచ్చని కుటుంబాలు నాశనం అయ్యాయి. మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు పోగేసుకొన్నారు.మత్తులో సేద తీరే శ్రమ జీవుల బలహీనతే పెట్టుబడిగా జగన్ కి కాసుల పంట పండించింది .దీనిని బట్టి ప్రజల ప్రాణాల పట్ల జగన్ రెడ్డి కి వున్న బాధ్యత ఏమిటో ప్రజలే అర్ధం చేసుకోవాల్సి వుంది. జగన్ హయాంలో కల్తీ మధ్య ద్వారా జరిగిన మరణాలను టాస్క్‌ఫోర్స్‌ సమగ్ర దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిదోషులను కఠినంగా శిక్షించాల్సి వుంది.