Site icon HashtagU Telugu

AP North : అమ్మో YCP, ఉత్త‌రాంధ్ర ఉలికిపాటు!

Ap North

Ap North

ఉత్త‌రాంధ్ర (AP North) రాజ‌కీయ కేంద్ర‌బిందువు విశాఖ జిల్లాలో రాజ‌కీయ తుఫాన్ క‌నిపిస్తోంది. ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు రాజీనామా చేయ‌డంతో ఫ్యాన్ పార్టీలో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌న్ను విశాఖ మీద ప‌డింది. ఆ ప్రాంతంలో రాజ‌కీయ పట్టుకోసం విజ‌య‌సాయిరెడ్డిని కాపాలాగా పెట్టారు. స్థానికంగా ఉండే లీడ‌ర్లు మూకుమ్మ‌డిగా రివ‌ర్స్ కావ‌డంతో పాటు భూ క‌బ్జాలు, ప్రైవేటు జీవిత విశేషాలు బ‌య‌ట‌కు రావ‌డంతో తాడేప‌ల్లికి ప‌రిమితం చేశారు. ఆయ‌న స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని ఉత్త‌రాంధ్ర రాజ‌కీయ కాప‌లాదారుగా పెట్టారు. భూ, మైనింగ్ త‌దిత‌ర క‌బ్జాల వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. దీంతో రాజ‌కీయంగా క‌డ‌ప బ్యాచ్ పెత్త‌నం పెరిగింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయ కేంద్ర‌బిందువు విశాఖ 

ఉత్తరాంధ్ర (AP North) ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటుంది. ఏపీలోని మిగిలిన ప్రాంతాల‌కు భిన్నమైన ప‌రిస్థితులు అక్క‌డ ఉంటాయి. ప్ర‌త్యేకించి విశాఖప‌ట్నం భిన్న ర‌కాల ప్ర‌జ‌లకు స్థావ‌రం. అక్క‌డ ఫ్యాక్జ‌నిజం, రౌడీయిజం, రాజ‌కీయిజం న‌డ‌వ‌దు. సౌమ్యంగా ఉండే వాళ్ల‌ను ఆద‌రించే సంస్కృతి అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉంది. అందుకే, 2014 ఎన్నిక‌ల్లో విజ‌యమ్మ‌ను ఓడించార‌ని చెప్పుకుంటారు. ఒక వేళ ఆమెను గెలిపిస్తే క‌డ‌ప బ్యాంచ్ వ‌స్తార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆలోచించి ఓటేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా నిలిచారు. ఫ‌లితంగా క‌డ‌ప బ్యాచ్ విశాఖ మీద వాలిపోయింది. ఉత్త‌రాంధ్ర జ‌నం ఏది వ‌ద్ద‌నుకున్నారో, అది ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే, ఫ్యాన్ పార్టీలోని కీల‌క లీడ‌ర్లు ఇత‌ర పార్టీల‌కు తట్టాబుట్టా స‌ర్దుకుంటున్నారు.

వై.వి.రెడ్డి సృష్టించిన సమస్యలను పరోక్షంగా రమేష్‌ బాబు

విశాఖపట్నంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పంచకర్ల రమేష్‌బాబు పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండ‌సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఫ్యాన్ పార్టీలో ఉండ‌లేక‌పోయారు. పార్టీ కేడర్‌, జిల్లా అవసరాలను తీర్చలేక బరువెక్కిన హృదయంతో పార్టీ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సమస్యలపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు అకాశం లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సమస్యలను పరిష్కరించలేనప్పుడు పార్టీలో కొన‌సాగ‌డం అర్థ‌ర‌హిత‌మ‌ని (AP North)అభిప్రాయ‌ప‌డ్డారు.

ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా వైసీపీకి తిరుగులేని దెబ్బ

వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం ఇంచార్జి, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ వై.వి.రెడ్డి సృష్టించిన సమస్యలను పరోక్షంగా రమేష్‌ బాబు ప్రస్తావించారు. సామాజిక‌వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోయే ప్ర‌య‌త్నాల విష‌యంలో సుబ్బారెడ్డి, ర‌మేష్ మ‌ధ్య అంత‌రం ఏర్ప‌డింది. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు లెక్క‌పెట్ట‌క‌పోవ‌డం, టిక్కెట్ వ‌స్తుందన్న న‌మ్మ‌కం లేక‌పోవ‌డం రాజీనామాకు కార‌ణాలుగా చెప్పుకుంటున్నారు. ఇంచార్జి సుబ్బారెడ్డితో ఎడ‌మొఖంపెడ‌మొఖంగా ఉంటోన్న పంచ‌క‌ర్ల వైసీపీకి గుడ్ బై చెప్ప‌డం ఉత్త‌రాంధ్ర‌లో (AP North)ఫ్యాన్ గాలి ఆగిపోతుంద‌న‌డానికి ఒక నిద‌ర్శ‌నం.

Also Read : Janasena fever : డిప్ర‌ష‌న్లో ప‌వ‌న్ ? సోష‌ల్ మీడియాలో YCP దుమారం!!

రమేష్ బాబు 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. అతను సీటు గెలిచాడు కానీ PRP అధ్యక్షుడు మరియు మెగాస్టార్ చిరంజీవితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరవలసి వచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రమేశ్‌బాబు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2014లో గంటా శ్రీనివాస్‌రావు, అవంతి శ్రీనివాస్‌లతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఎలమంచిలి నుంచి టీడీపీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2020 ఆగస్టులో రమేష్ బాబు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన అక్కడ (AP North) సర్దుకుపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన జనసేన పార్టీలో చేర‌బోతున్నారు.

Also Read : Vijayasai Reddy: కేసీఆర్ పై ఎత్తుకు చిత్తై… విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..!!

గ‌తంలోనూ విజ‌య‌సాయిరెడ్డి ఉత్త‌రాంధ్ర (AP North)ఇంచార్జిగా ఉన్న‌ప్పుడు పలు స‌మ‌స్య‌లను స్థానిక లీడ‌ర్లు ఎదుర్కొన్నాను. ప‌లుమార్లు తాడేప‌ల్లి కోట‌లో పంచాయ‌తీ పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే, ఏడాదిన్న‌ర క్రితం సుబ్బారెడ్డి ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌లేదు. పైగా కొత్త స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ద్ద ఉన్న స‌మాచారం. సాధార‌ణంగా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గుచూపితే అటు అధికారం అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఉత్త‌రాంధ్ర లీడ‌ర్లు, ప్ర‌జ‌లు ఫ్యాన్ కు దూర‌మ‌వుతున్న‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి. అంటే, రాబోయే రోజుల్లో ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా వైసీపీకి తిరుగులేని దెబ్బ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల జరిగిన స్థానిక‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఎమ్మెల్సీ ఫ‌లితాలు అందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి.