ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగాన్ని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ పథకాన్ని ప్రాథమికంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జూన్ నుంచి లీప్ పాఠశాలల ప్రారంభం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యా & ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించిన “ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”కు లీప్ పథకం ఆధారంగా పనిచేస్తుంది. విద్యారంగంలో ఉన్న లోపాలు, సవాళ్లను గుర్తించి రాబోయే ఐదేళ్లలో అవసరమైన మార్పుల కోసం ప్రత్యేకంగా లీప్ డాక్యుమెంట్ రూపొందించారు. ఇందులో పూర్వ ప్రాథమిక విద్యా స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలు, వాటికి అవసరమైన టైమ్‌లైన్‌లు స్పష్టంగా పేర్కొన్నారు. లీప్ పాఠశాలలను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులపై ఉంటుందని తెలిపారు.
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
లీప్ కార్యక్రమం నాలుగు విద్యా స్థాయిలను మెరుగుపరచడంపై దృష్టిసారించనుంది. ఫౌండేషనల్ స్థాయిలో, అంగన్‌వాడీల్లో 100% విద్యా కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు మొదలవుతాయి. ప్రాథమిక & ప్రాథమికోన్నత స్థాయిలో, విద్యార్థుల బుద్ధి సామర్థ్యాల అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, పాఠశాల మానేసిన వారిని తిరిగి చేర్చడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. సెకండరీ స్థాయిలో, పరిశ్రమ అవసరాలకనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించి, 21వ శతాబ్దపు సామర్థ్యాలను విద్యార్థుల్లో ఏర్పరిచే లక్ష్యంతో పనిచేస్తుంది.
ఈ పథకం అమలులో ఐదు ప్రధాన అంశాలు కీలకంగా ఉంటాయి: ప్రతి ఒక్కరికి సమాన విద్యా అవకాశాలు కల్పించడం, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి, పరిశ్రమకు అనుగుణంగా నైపుణ్యాల బలీకరణ, పరిశోధనల ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, దాతల సహకారంతో లీప్ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్న ప్రభుత్వం, ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉన్నత విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.