Pocso Case : చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) పై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Published By: HashtagU Telugu Desk
AP High Court dismissed Chevireddy quash petition

AP High Court dismissed Chevireddy quash petition

Pocso Case:  మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి వ్యాఖ్యానించారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది.

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) పై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తరువాత అటువంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ అంతకుముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు చెవిరెడ్డిపై ఫోక్సో కేసు పెట్టారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు ఉదయం తీర్పు ఇచ్చిన హైకోర్టు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

కాగా, మైనర్‌ బాలిక స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందని అన్నారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు సదరు బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు.. తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Read Also: Formula E Case : ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి

 

  Last Updated: 10 Jan 2025, 12:22 PM IST