ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ప్రజల కోరిక మేరకు కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్ అన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం ‘సూపర్ 6’ పథకాల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం, మెగా DSCపై సంతకం చేయడం, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గవర్నర్ పేర్కొన్నారు.
2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా (Swarna Andhra@2047 ) ముందుకు అనే అభిప్రాయాన్ని గవర్నర్ నజీర్ వ్యక్తం చేశారు. ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, పెన్షన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచినట్లు, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంతో పాటు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేశామని, రాష్ట్రాన్ని ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో కీలకంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కొత్త పెట్టుబడుల కారణంగా తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లు గవర్నర్ ప్రకటించారు.
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీని అధికార ప్రతిపక్షంగా గుర్తించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. దాదాపు 11 నిమిషాల పాటు నిరసన తెలిపిన అనంతరం, వైసీపీ అధినేత జగన్ సహా అన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభను వాకౌట్ చేశారు. సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.