Site icon HashtagU Telugu

CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు

AP government's key decision... 30,899 jobs with 22 projects

AP government's key decision... 30,899 jobs with 22 projects

CM Chandrababu : ఇకపై రాష్ట్రంలో ఏర్పడే పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం (Eco System) అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ ఎకో సిస్టం ద్వారా ప్రాజెక్టుల వల్ల ప్రాధాన్యంగా స్థానిక ప్రజలకు, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రయోజనం కలగాలని ఆయన పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, కె. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు పాల్గొన్నారు. సీఎస్ కె. విజయానంద్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read Also: Narmada River : నర్మద పేరుతో కోడి జాతి ప్రకటన..మధ్యప్రదేశ్‌లో వివాదం, నర్మదీయ బ్రాహ్మణ సమాజం ఆగ్రహం

ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11, ఇంధన రంగానికి 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. పరిశ్రమలు ఎక్కడ స్థాపించబోతున్నాయో ఆ ప్రాంతాల వద్ద రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు, స్థానికులకు లాభం కలిగేలా చూడాలని సూచించారు. కేవలం కంపెనీల ప్రయోజనాల కోణంలో కాకుండా, స్థానిక అభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యాటక రంగాన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శ్రీశైలంలో దేవాలయ పర్యాటనతో పాటు, అక్కడి నీటి ప్రాజెక్టును కూడా ప్రయోజనంగా మలచుకుని సమీకృత పర్యాటక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. శ్రీశైల రహదారి విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

8వ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇవే..

1. ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ – విశాఖలో రూ.205 కోట్లు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు.
2. శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ- చిత్తూరులో రూ.282 కోట్లు పెట్టుబడి, 1400 ఉద్యోగాలు.
3. రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.1800 కోట్లు పెట్టుబడి, 380 ఉద్యోగాలు.
4. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ – కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.3600 కోట్ల పెట్టుబడి, 760 ఉద్యోగాలు
5. జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ – కడప జిల్లాలో రూ.2000 కోట్ల పెట్టుబడి, 1380 ఉద్యోగాలు
6. పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ – శ్రీకాకుళం జిల్లాలో రూ.204 కోట్లు పెట్టుబడి, 1000 ఉద్యోగాలు
7. పీవీఎస్ గ్రూప్ – విజయనగరం జిల్లాలో రూ.102 కోట్ల పెట్టుబడి ,500 ఉద్యోగాలు
8. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్- నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టు, రూ.4708 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు
9. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ – విశాఖలో రూ.328 కోట్ల పెట్టుబడి, 1100 ఉద్యోగాలు
10. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్- విశాఖలో రూ.86 కోట్ల పెట్టుబడి, 720 ఉద్యోగాలు
11. స్టార్ టర్న్ హోటల్స్ ఎల్ఎల్ పీ- తిరుపతిలో రూ.165 కోట్ల పెట్టుబడి , 280 ఉద్యోగాలు
12. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ – తిరుపతి నాయుడుపేట సెజ్ లో రూ.1147 కోట్ల పెట్టుబడి, 1475 ఉద్యోగాలు
13. యాక్సెలెంట్ ఫార్మా – తిరుపతి శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడి, 1770 ఉద్యోగాలు
14. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – కర్నూలు జిల్లాలో (సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి), రూ.6933 కోట్ల పెట్టుబడి, 2138 ఉద్యోగాలు
15. జేఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ – కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రూ.4500 కోట్ల పెట్టుబడి (రెండు దశల్లో), 2500 ఉద్యోగాలు
16. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్- అనకాపల్లి జిల్లా (ఫోటో వోల్టాయిక్ ప్లాంట్) రూ.3700 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు
17. లారస్ ల్యాబ్స్ – అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.5630 కోట్ల పెట్టుబడి, 6350 ఉద్యోగాలు
18. లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- విశాఖ, విజయవాడలలో రూ.1222 కోట్లు పెట్టుబడి, 1500 ఉద్యోగాలు
19. ఏస్ ఇంటర్నేషనల్ – చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు
20. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ ఇండియా- అచ్యుతాపురం సెజ్ లో ఫుట్ వేర్, టాయ్స్ తయారికీ అనుమతి
21. వీఎస్ఆర్ సర్కాన్ – శ్రీకాకుళం జిల్లాలో రూ.39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు
22. అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్ – కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.500 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు

అతిథ్య రంగంలో హోటళ్లతోపాటు వినోద, సేవల రంగాల ప్రాజెక్టులను కూడా ప్రోత్సహించాలని సీఎం తెలిపారు. పీపీపీ మోడల్‌లో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్దేశిత గడువుల్లో పూర్తి కావాలని, ఆలస్యం జరిగితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన SIPB సమావేశాల్లో మొత్తం 109 ప్రాజెక్టులు ఆమోదం పొందాయని సమాచారం. వీటిలో పారిశ్రామిక రంగానికి చెందిన 46, ఇంధన రంగానికి 41, పర్యాటకానికి 11, ఐటీకి 7, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 4 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం పెట్టుబడి విలువ రూ.5,74,238 కోట్లు కాగా, 5,05,968 మందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రాజెక్టుల అమలులో పారదర్శకత, సమగ్ర సమాచారం కోసం ఉద్యోగావకాశాలపై స్పష్టత ఇచ్చే ఎంఫ్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పారిశ్రామికీకరణతో పాటు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, స్థానికుల భాగస్వామ్యం, సేవల రంగ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. అన్ని రంగాలు సమన్వయంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు.

Read Also: Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ