AP Govt : దారిద్ర్యరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటిస్థల కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేసారు. అందరికి ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంటిపట్టా ఇచ్చిన రెండేళ్లోపు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుడుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు.
దీంతో పాటు వివిధ అర్హతా నిబంధనల్ని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసారు. రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా, పురపాలక, హౌసింగ్ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం కూడా అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
Read Also: Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..